Nov 09,2023 22:30

చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు
10పాయింట్లతో నాలుగో స్థానంలో విలియమ్సన్‌ సేన
బెంగళూరు: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు సమిష్టిగా రాణించింది. తొలుత శ్రీలంకను 171పరుగులకే పరిమితం చేసిన న్యూజిలాండ్‌.. ఆ లక్ష్యాన్ని 23.2ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండ్‌ షో ప్రదర్శించింది. టాస్‌ గెలిచిన విలియమ్సన్‌ తొలిగా బౌలింగ్‌ చేసేందుకు మొగ్గు చూపాడు. కెప్టెన్‌ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని న్యూజిలాండ్‌ బౌలర్లు వమ్ము చేయగా.. శ్రీలంక బ్యాటర్స్‌ పని పట్టారు. దీంతో లంక జట్టు 128పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్‌ కుశాల్‌ పెరీర్‌(51) 22 బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టాడు. దీంతో ఈ టోర్నమెంట్‌లో తక్కువ బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టిన తొలి బ్యాటర్‌గా కుశాల్‌ పెరీరా నిలిచాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్స్‌ తీక్షణ(38), మధుశంక(19) కలిసి 10వ వికెట్‌కు 43పరుగులు జతచేశారు. మధుశంకను రవీంద్ర ఔట్‌ చేయడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌ 46.4 ఓవర్లలో 171పరుగుల వద్ద ముగిసింది. న్యూజిలాండ్‌ బౌలర్లు బౌల్ట్‌కు మూడు, ఫెర్గుసన్‌, సాంట్నర్‌, రవీంద్రకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని
ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ సునాయాసంగానే ఛేదించేలా కనిపించినా ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే(45), రచిన్‌ రవీంద్ర(42) కలిసి తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(14) విఫలమైనా.. డారిల్‌ మిచెల్‌(43) ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌(17), టామ్‌ లాథమ్‌(2) అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్‌ కేవలం 23.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్‌కు రెండు, మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీరకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ ప్రస్తుతం 9మ్యాచ్‌లు ముగిసేసరికి 5విజయాలు, 10పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. ఆ జట్టు సెమీస్‌ చేరాలంటే... పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. ఒకవేళ ఆ రెండు జట్లు గెలిస్తే రన్‌రేట్‌ కీలకం కానుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్‌ రన్‌ రేట్‌ +0.922 కాగా, పాకిస్తాన్‌(0.036), ఆఫ్ఘనిస్తాన్‌(-0.038)తో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు...
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిస్సంక (సి)లాథమ్‌ (బి)సౌథీ 2, కుశాల్‌ పెరీరా (సి)స్నాంటర్‌ (బి)ఫెర్గ్యుసన్‌ 51, కుశాల్‌ మెండీస్‌ (సి)రచిన్‌ రవీంద్ర (బి)బౌల్ట్‌ 6, సమరవిక్రమ (సి)మిఛెల్‌ (బి)బౌల్ట్‌ 1, అసలంక (ఎల్‌బి)బౌల్ట్‌ 8, మాధ్యూస్‌ (సి)మిఛెల్‌ (బి)సాంట్నర్‌ 16, ధనుంజయ (సి)మిఛెల్‌ (బి)సాంట్నర్‌ 19, కరుణరత్నే (సి)లాథమ్‌ (బి)ఫెర్గ్యుసన్‌ 6, తీక్షణ (నాటౌట్‌) 38, ఛమీర (సి)బౌల్ట్‌ (బి)రవీంద్ర 1, మధుశంక (సి)లాథమ (బి)రవీంద్ర 19, అదనం 4. (46.4ఓవర్లలో ఆలౌట్‌) 171పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/30, 3/32, 4/70, 5/70, 6/104, 7/105, 8/113, 9/128, 10/171
బౌలింగ్‌: బౌల్ట్‌ 10-3-37-3, సోథీ 8-0-52-1, ఫెర్గ్యుసన్‌ 10-2-35-2, సాంట్నర్‌ 10-2-22-2, రవీంద్ర 7.4-0-21-2, ఫిలిప్స్‌ 1-0-3-0
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి)ధనుంజయ (బి)డి సిల్వ 45, రవీంద్ర (సి)ధనుంజయ (బి)తీక్షణ 42, విలియమ్సన్‌ (బి)మాథ్యూస్‌ 14, మిఛెల్‌ (సి)అసలంక (బి)మాథ్యూస్‌ 43, ఛాప్మన్‌ (రనౌట్‌) సమరవిక్రమ 7, ఫిలిప్స్‌ (నాటౌట్‌) 17, లాథమ్‌ (నాటౌట్‌) 2, అదనం 2. (23.3ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 172పరుగులు.
వికెట్ల పతనం: 1/86, 2/88, 3/130, 4/145, 5/162
బౌలింగ్‌: మధుశంక 6.2-0-58-0, తీక్షణ 7-0-43-1, ధనుంజయ 2-0-22-0, ఛమీర 4-1-20-1, మాథ్యూస్‌ 4-0-29-2.