Apr 02,2023 21:25

ఢిల్లీ: మార్చి నెలలో విదేశీ మదుపర్లు నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. అంతకు ముందు వరుసగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున భారత ఈక్విటీల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు. అయితే, మార్చిలో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో జీక్యూజీ పార్టనర్స్‌ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. దీని కారణంగా గత నెలలో ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా నిలిచారు.డిపాజటరీస్‌ సమాచారం ప్రకారం.. మార్చిలో ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో నికరంగా రూ.7,396 కోట్లు మళ్లించారు. అదే ఫిబ్రవరిలో రూ.5,294 కోట్లు, జనవరిలో రూ.28,852 కోట్లు ఉపసంహరించుకున్నారు. అలాగే గత ఏడాది డిసెంబరులో రూ.11,119 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. రంగాలవారీగా చూస్తే.. ఎఫ్‌పీఐలు క్యాపిటల్‌ గూడ్స్‌ సెక్టార్‌ స్టాక్స్‌ని స్థిరంగా కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అదే ఆర్థిక సేవల రంగంలో ఒక నెల కొనుగోళ్లు, మరో నెల అమ్మకాల ట్రెండ్‌ కనిపించింది.
ఒకవేళ అదానీ గ్రూప్‌లో జీక్యూజీ పెట్టుబడులను మినహాయిస్తే మార్చి నెలలోనూ విదేశీ మదుపర్లు నికర అమ్మకందారులుగా నిలిచేవారు. అంటే ఒకరకంగా చూస్తే గత నెలలోనూ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయనే చెప్పాలి! అయితే, ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణకు ఇక కళ్లెం పడే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి.కె.విజయకుమార్‌ అన్నారు. గత నెలలో చివరి రోజుల్లో వారు నికర కొనుగోలుదారులుగా నిలవడమే అందుకు నిదర్శమన్నారు. మార్కెట్‌లో ఇటీవల వచ్చిన దిద్దుబాటుతో కొన్ని కీలక కంపెనీల స్టాక్స్‌ కొనుగోలుకు ఆకర్షణీయంగా మారాయని తెలిపారు. మరోవైపు దేశీయంగా ఆర్థిక పరిస్థితులు చక్కబడడం కూడా అందుకు కారణమన్నారు. ప్రస్తుత ఖాతా లోటు గణనీయంగా మెరుగుపడడం కూడా దోహదం చేస్తుందన్నారు.