- వరుస ప్రకంపనలతో ప్రజలు బెంబేలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
ఖాట్మాండు : నేపాల్‌ను మరోసారి భూకంపం కుదిపేసింది. కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్‌కోట్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూ కంపం తీవ్రత రిచ్‌టర్ స్కేలుపై 6.4 పాయింట్లుగా నమోదయింది. ఈ భూకంపంలో ఇంతవరకు 157 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. న్యూఢిల్లీలో సైతం ప్రకంపనలు వచ్చాయి. నేపాల్‌లోని జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా జాజర్‌కోట్ జిల్లా జాజర్‌కోట్, భేరీ, నల్‌గాడ్, కుషే, బరేకోట్, చెడ్‌గఢ్ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. జాజర్‌కోట్ జిల్లాలో 105 మంది, రుకుమ్ వెస్ట్ జిల్లాలో 52 మంది మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి జాజర్‌కోట్ జిల్లాలో భూకంపం సంభవించిన తరువాత నాలుగు పాయింట్ల తీవ్రతతో మరో నాలుగు ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తారు. శుక్రవారం అర్ధరాత్రి 12.08 గంటలకు 4.5 తీవ్రతతోనూ, 12.29 గంటలకు 4.2 తీవ్రతతోనూ, 12.35 గంటలకు 4.3 తీవ్రతతోనూ, 4.16 గంటలకు 4.6 తీవ్రతతోనూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపాలతో కూలిన భవనాల శిథిలాల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకోవడానికి చీకటిలో, కేవలం వట్టి చేతులతోనే శిథిలాలను నేపాల్ ప్రజలు తవ్వడం చూసేవారిని కలచివేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయపడిన వారికి వైద్య సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. విద్యుత్ సరఫరాను, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఉచితంగా టెలికం సేవలు అందజేస్తారు. గాయపడిన వారిని రాజధాని ఖాట్మండులోని టివి టీచింగ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకోసం భద్రతా సిబ్బందిని నియమించారు. సహాయక కార్యక్రమాలు శనివారం రాత్రి వరకూ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయమే జాజర్‌కోటలోని సంఘటనా స్థలానికి నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ 16 మంది సభ్యుల వైద్య బృందంతో చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. నేపాల్ ఆర్మీ, పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అవసరమైన వారికి వైద్య సాయం అందించేందుకు నేపాల్‌గంజ్ విమానాశ్రయం హెలిపాడ్ వద్ద అంబులెన్సులను సిద్ధం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు, బట్టలు, టెంట్లు అందజేసేందుకు వీలుగా అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు విరాళాలు అందించాలని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తి చేసింది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి భారత్, చైనా ముందుకు వచ్చాయని ఉపప్రధాని నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు. రోడ్లపై కొండచరియలు విరిగిపడటం సహాయక కార్యక్రమాలకు ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తేలికపాటి హెలికాప్టర్లలో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారని చెప్పారు.
రాత్రంతా బిక్కుబిక్కుమంటూ..
ఈ భూకంపంలో చాలా ఇళ్లు కూలిపోయాయని, మరికొన్ని పగుళ్లు వచ్చాయని జాజర్‌కోట్ జిల్లా అధికారి హరీష్‌చంద్రశర్మ తెలిపారు. ఇంట్లో ఉండడం సురక్షితం కాదని చాలా మంది ఆరుబయట ఎముకలు కొరికే చలి మధ్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారని అన్నారు.
'మేము గాఢనిద్రలో ఉండగా భూమి ఒక్కసారిగా కంపించింది. లేచి పరుగెత్తేలోపే ఇల్లు మొత్తం కూలిపోయింది. నా శరీరంలో సగభాగం శిథిలాల్లో కూరుకుపోయింది' అని ప్రమాదం నుంచి అతి కష్టం మీద బయటపడి తొలి ఇద్దరిలో ఒకరైన బిమల్ కుమార్ కర్కి చెప్పారు.
అండగా ఉంటాం : ప్రధాని మోడీ
నేపాల్‌లో భూకంపంపై భారత ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా ఉంటామని, ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. నేపాల్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం అత్యవసర కాంటాక్ట్ నంబర్‌ను విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఢిల్లీ, బీహార్‌లోనూ ప్రకంపనలు
నేపాల్‌లో సంభవించిన భూపంక ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, బీహార్‌లోని అనేక సరిహద్దు జిల్లాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి వచ్చారు. భారతీయ టెక్టోనిక్ ఫలకానికి, యురేషియన్ ఫలకానికి మధ్య రాపిడి ప్రాంతంపై నేపాల్ ఉండటంతో ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయని భూ గర్భ పరిశోధకులు తెలిపారు. అక్టోబర్ ఒక్క నెలలోనే మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో సుమారు తొమ్మిది వేల మంది మరణించారు.