Apr 03,2023 07:56

         నెమిలేటి కిట్టన్న చిత్తూరు జిల్లా పడమటి మండలాల కరువు కాటకాల ఆకలి నెగళ్ళ సెగల తాకిళ్ళని తట్టుకోలేక వెర్రి పరుగులు తీసి వచ్చిన మట్టి మనిషి. పల్లె పెత్తందారీల అసూయల మంటల్లో పొగచూరిపోయి ఎలాగో అక్షరాల మలాము రాసుకుని కురుపుల్ని మాన్పుకుని బతికి బట్టకట్టిన గట్టి పిండం. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో అడవులని ఆశ్రయించి, ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ప్రజాకవి. కిట్టన్న కవిత్వం ప్రజల పక్షంలోనే ఉంటుంది. ప్రజల గొంతుకై వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చి రగులుకొన్న ఆయన తాజా కవిత్వం 'అక్షరాల కొలిమి' చర్చనీయం.
       నెమిలేటి కవిత్వంలో ఎడారి అడవుల్లో మండుటెండల్లో ఎండి, కార్చిచ్చుల్లో మండి, బతికి బట్టకట్టిన ఆ చిగరచెట్టుకున్న చేవలాంటి ముతకతనం కనిపిస్తుంది. 'తొలకరి చినుకుల్లో తడిసిన/ మట్టి పరిమళం అమ్మ' 'నీ బాధనంతా తన మనసుతో తడిమిన తల్లి' అన్న మాటలు, తల్లిదండ్రుల్ని అక్షరాల సీతాకోకచిలుకలుగా చేసిన ఊహ అతని భావుకత్వపు లోతుల్ని తెలియజేస్తాయి. అందరూ నటసార్వభౌములే పద్యం కవి మనిషిని ఎంతగా చదివేశాడో తెలియజేస్తుంది. మనిషిలోని మృగాలని వ్యంగ్య బాణాలతో కొట్టి చంపేస్తుంది. రాజ్యం దాని ప్రతినిధులు తమ ఇష్టం వచ్చినట్లు అరాచకాలు చేస్తుంటే ఎవరు పెదవి విప్పకున్నా అక్షరాలు ఊరుకోవని, అవి మాట్లాడుకొని ఆ వినాయకులను గద్దె దించుతాయని, రాజకీయ పెత్తందారీ తనానికి అంతిమ సంస్కారం చేస్తాయని ధైర్యంగా హెచ్చరిస్తాడు నెమిలేటి. ప్రజల సొత్తైన విశాఖ ఉక్కును పరులపరం చేస్తే ఉక్కు పిడికిళ్ళు బిగుస్తాయని హెచ్చరిస్తున్నాడు.
          నెమిలేటి అక్షరాల కొలిమిని చేతిలో పట్టుకుని పద్యాల్ని చదివి పక్కన పెడితే ఒళ్ళంతా కొలిమివద్ద చలి కాచుకున్నప్పటి కమురువాసన కొడుతుంది. అలా ఒక మార్మికమైన వింత అనుభవం కలుగుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సేద్యం జవసత్వాల్ని కోల్పోయింది. పల్లెని పుడమితల్లిని నమ్ముకున్న భూమిపుత్రులు తమ నమ్మకం వమ్ముకాగా వలసలెత్తి నగరాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు జనాల్లేక మాటల్లేక బంధుత్వాల్లేక ఆప్యాయతల్లేక ఆదుకునేవాళ్ళు లేక పరిచితుల్లేక ఒకప్పటి ఆనవాళ్ళు కూడా లేక పల్లె ఒక జ్ఞాపకాల చెట్టుగా మిగిలిపోయిందని నెమిలేటి బాధపడతాడు. గ్లోబలైజేషన్‌ ప్రక్రియలో బహుళ అంతస్థుల భవనాలు లేస్తున్నాయి. పూరిండ్ల సంస్క ృతి కనుమరుగైపోతున్నది. ఒకప్పుడు ఇంటికి వెన్నై నిలిచిన నిట్రాయి లాంటి వాటినీ మరిచిపోతున్నాం. ''నేనురా నీ పూరిగుడిసె నిట్టాడునురా, అప్పుడే మరిచిపోతివేమప్పా'' అని దాన్ని మనతో మాట్లాడిస్తాడు కవి. గతం పునాదులపై వివేకంతో కూడిన భవిషత్తును నిర్మించుకోవాలన్న సందేశం అందులో కనిపిస్తుంది. కరోనా సమయంలో ఇలాంటి రోజొకటి వస్తుందనుకోలా అంటున్నపుడు కూడా ''కులం కుంపటి నెత్తిన పెట్టుకొని ఊరేగినోడా/ మతం మత్తుమందు/ నరనరాన నింపుకున్న వాడా/ యాడబాయరా నీ కులం, నీ మతం/ కరోనా కాటుకు వ్యాక్సిన్‌ వస్తుందని చెప్పగలను/ నీ కులం భూతాల్ని అంతం/ చేసే మానవీయ లేపనం/ తయారు చేసే మొనగాడెక్కడీ'' అని సామాజిక స్ప ృహని ప్రదర్శిస్తాడు.
          మామూలు మాటల్లో సాదాసీదాగా చెప్పినా 'చివరి వీలునామా రాసుకుందాం' పద్యంలో సాటి వ్యక్తులైన స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడకుండా ఒక ఒప్పందంలా కట్టుబాటు చేసుకుందాం అన్న కవి వాక్యాలు అతని హృదయ స్వచ్ఛతని తెలియజేస్తాయి. స్త్రీల పట్ల తనకున్న అనుకంపనీ గౌరవ భావాన్నీ వెల్లడిస్తాయి. 'జీవకారుణ్యం లేని నువ్వు/ ఒట్టి బండరాయివి కదరా' అంటూ ప్రకృతి పట్లా ప్రకృతి ఆనవాళ్ళైన వృక్షజాతుల పట్లా, జంతుజాలం పట్లా బాధ్యత కలిగి మసలుకోమంటాడు. చెయ్యరాని అన్యాయాలూ అణచివేతలూ చేస్తూ ఏ వైరుధ్యాలూ లేవు కలసిపోదాం రమ్మని పిలిస్తే ఎట్లా రమ్మంటావని పెత్తందారీ కులాలవాళ్ళని నిలదీస్తాడు. 'దుర్మార్గపు ఖడ్గాన్ని చేతబట్టిన వాడ్ని/ నీ మధురకవిత్వం మారుస్తుందా?' అని కవి కవిత్వపు శక్తిని శంకిస్తాడు. అమెరికాలో జార్జి ప్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి ప్రాణాల్ని శ్వేతజాతి దురహంకారం బలిగొన్నపుడు కడుపుమండిన కవి 'నలుపంటే శ్వేతసౌధంపై/ రపరెపలాడిన విజయపతాకం/ నలుపంటే జాత్యహంకారాన్ని/ నిలువునా నరికే గండ్రగొడ్డలి...' అంటూ ఎమోషనల్‌గా ఇచ్చిన నిర్వచనాల సమాహారాన్ని చదివితీరాలి.
            నెమిలేటికి పరకాయ ప్రవేశం చేసే విద్య కూడా బాగా తెలుసు. నా అంతరంగ మందిరం కవితలో ఒక శృంగార శ్రామికలోకి ప్రవేశించి 'కైపెక్కించే కళ్ళతో కసిగా/ నా కాటుక కన్నులనే చూశాడు/ తప్ప కాళరాత్రుల రుచులతో/ అలసిపోయిన నా మనోనేత్రాన్ని చూడలేదెవడూ/ వాడు నా నుండి తృప్తిని/ కొల్లగొట్టి బోనసుగా ఇచ్చిన/ రోగగ్రస్త జీవితం నాది' అని ఆర్తితో అన్న మాటలు కదిలించివేస్తాయి. కరోనా కష్టకాలంలో పాలకుల నిర్లక్ష్యవైఖరిని ఎండగడుతూ 'శవాల గుట్టల మధ్య కూర్చొని/ కమురు వాసన ఆస్వాదిస్తూ కునుకు తీస్తున్నాడు/ రోగిష్టి భారతాన్ని/ కలలు కంటూ/ భవిషత్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న వేళ/ నా దేశానికి జ్వరం వచ్చింది' అని చురకలేస్తాడు. నెమిలేటి శ్రమసంస్క ృతిని ఇష్టంగా హత్తుకుంటాడు. 'తనువంతా శ్రమసుగంధం పూసుకున్న/ తూర్పున ఉదయించిన సూర్యుడు నాన్న' అని వర్ణించడంలో శ్రమపై తనకున్న అమితమైన గౌరవం ద్యోతకమవుతుంది. రాయలసీమలో బతుకు ఛిద్రం కావడానికి హేతువుల్ని ఏకరువు పెట్టి వాటిని చూసి తనలో బాధల ముల్లు చెట్టయి మొలిచిదంటున్న నెమిలేటిలో ప్రాంతీయ అస్తిత్వప్రీతి కూడా మెండుగానే కనబడుతుంది.
           'పరిమళించిన పద్యం'లో కవిత్వ తత్వాన్ని కూడా ప్రస్తావించాడు ఈ కవి. తన కవిత్వం ఉబుసుపోక కోసం రాసేది కాదు. అది చైతన్యస్పోరకం. గుణాన్నీ తెలుగుదనాన్నీ ఆపాదించి చెప్పిన ఆ పద్యం నిజంగానే పరిమళిస్తోంది. బీజాక్షరాలై మొలుద్దాం, ప్రకృతిమాతా వర్ధిల్లవమ్మా, భూమి నా భావావేశం, మా ఊరికి రాజధానొచ్చింది కవితల్లో ప్రకృతిపై ప్రేమతో బాటు సమస్త శుభాలనూ వృక్షాలతో కూడిన ప్రకృతే ప్రసాదిస్తుందని, ఆ ప్రకృతిని ప్రాకృతికమైన విపత్తులనుండి, కబ్జాకోరుల నుండి కాపాడుకోవాలని పిలుపునిస్తాడు. 'మట్టిని ధ్వంసం చేసినవాడు/ మట్టి గొట్టుకు పోతాడంతే' అని తీవ్రస్వరంతో శపిస్తాడు. మట్టిన నమ్ముకున్న రైతులు ప్రపంచీకరణలో, సెజ్జుల జాతరలో, రాజధాని భూసేకరణల్లో భూమిని కోల్పోయి కార్పొరేటు కంపెనీల వద్ద బానిసలుగా మారడాన్ని చూసి, పచ్చని పంటభూములు కాంక్రీటు జంగిల్లుగా మారిపోవడం చూసి ఆక్రోశిస్తాడు. ఒక గురువుగా నెమిలేటి బాలల్ని ఎంతో ఇష్టపడతాడు. కరోనా కాలంలో వాళ్ళకి దూరమై బడిలేక బాల్యం ఏమవుతున్నదోనని పదేపదే ఆందోళన చెందుతాడు. మనువు వారసులు మళ్ళీ పేట్రేగి దేశాన్ని కులం మంటల్లో తగులబెడుతున్నారని, దేశ మూలవాసుల ఆనవాళ్ళని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని, దేశీయుల్ని పరదేశీయులుగా చిత్రిస్తునారని, ప్రశ్నించే హక్కును కబ్జా చేస్తున్నారని, ఏం తినాలో ఏం తాగాలో కూడా వాళ్ళే నిర్దేశిస్తున్నారని ... అలాంటి కుహనా దేశభక్తులకు బుద్ధి వచ్చేలా మన జెండాను నిండుగా ఎగురనిద్దాం అంటున్నాడు నెమిలేటి. నెమిలేటి అక్షరాల కొలిమి టైటిల్‌ పద్యం కవి ఎందుకు అక్షరాల కొలిమై రగిలిపోతున్నాడో లోతుగా సూటిగా చెబుతుంది. 'నా పూర్వీకుల ముద్రలు చెరిపేసిన రోజే/... మా నానమ్మ చెప్పిన/ బ్రహ్మం గారి తత్వాల సాక్షిగా/... ఎవడో పనిగట్టుకుని ఏక శరీరంలాంటి/ మా ఉమ్మడి కుటుంబాన్ని చాలా శ్రద్ధగా/ నిలువునా చీల్చి/ నా వెన్నెల/ బాల్యంలో చీకట్లు నింపి/ నన్ను బడికి దూరం చేసినప్పుడే/... మా ఊరి కరణం దగ్గరకు వెళ్లి/ నా కులం సర్టిఫికెట్‌ ఇమ్మంటే/ నవ్వు చదువుకుంటే/ నాకేమొస్తుందని ప్రశ్నించిన/ వాడి నాలుగెకరాల ఎర్రనేలలో/ మేడిపట్టి దుక్కి దున్నిన/ నా రెండు చేతులు/ బొబ్బలెక్కినప్పుడు/... మా వూరి జుట్టుసామి/ కులంతక్కవోడికి నీకు చదువెందుకురా? అంటూ/ చదువుకుంటే బొత్తిగా చెడిపోతావురా అన్నప్పుడు/... ఆటపాటలతో ఉల్లాసంగా/ సాగుతున్న నా చదువు/ ఉన్నపళంగా డ్రాపౌట్‌ విద్యార్థిని చేసినప్పుడు/ రెండు సంవత్సరాల పాటు/ మా మడిచెక్కలో/ అడుసు తొక్కే మట్టి పాదాన్నైనప్పుడు/... మా భాగానికొచ్చిన/ నాలుగు కొండ్రల నేలలో/ వేరుసెనగ విత్తునై మొలిచి/ పూతకొచ్చేవేళకు కురవని/ మొండి జీమూతల్ని జూచిన/ అమ్మానాన్నలు/ చేసిన అప్పు తీర్చడానికి క్వారీలో కంకర రాళ్లైనప్పుడు/ నాలో రగులుకొంది కొలిమి' అంటాడు కవి. అలా తన బాల్యం చుట్టూ ఆవరించిన తమ నిస్సహాయతల్లోంచి, అవమానాలు అణచివేతలు కుట్రలపై పుట్టిన కసిలోంచి ఆ అక్షరాల కొలిమి రగులుకున్నది. ''అది మామూలు కొలిమి కానేకాదు/ ఈ అసమ సమాజాన్ని అంటుకున్న/ సకల రుగ్మతలను/ నయంచేసే దివ్యౌషధాన్ని/ పుక్కిటబట్టి ఊదుతున్న కొలిమి'' అని కవే స్పష్టం చేస్తాడు. అది అసలుసిసలు సృజనకారుడి ప్రతిజ్ఞ. నెమిలేటి కావ్యం పొడుగునా ఎక్కడా పట్టుసడలకుండా చిక్కగా అల్లగలిగిన మరీ కవిత్వపు లోతుల కిటుకులు తెలిసిన నెరజాణ కాకపోవచ్చు. కానీ తన నేపథ్యం నుంచి పుట్టిన తనలోని కసి ఆయన వాక్యాలకు కత్తివాదరనిచ్చింది. తనని ప్రగతిశీలవాదిగా ప్రజాతంత్రవాదిగా సమరశీలిగా ప్రజాకవిగా చేసింది. అలా కొలిమిలా రగులుతున్న నెమిలేటి కిట్టన్న కవిత్వాన్ని స్థానిక సాహితీ సమాజాలు గుర్తించకపోవడంలో పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్న నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది.

- కవితశ్రీ