Apr 07,2023 21:23

స్టీల్‌ మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ : వైజాగ్‌ స్టీల్‌ అమ్మకం ప్రక్రియ కొనసాగుతుందని ఉక్కు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (వైజాగ్‌ స్టీల్‌) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న బిడ్డర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని ఉక్కు మంత్రిత్వ శాఖ భేటీలో పాల్గన్న వ్యక్తులు పేర్కొన్నట్లు బిజినెస్‌ లైన్‌ ఓ కథనం ప్రచురించింది. ఆ సమాచారం మేరకు.. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో ఫోర్జ్‌ వీల్‌ యూనిట్‌ కార్యకాలపాలు, నిర్వహణను నిలిపివేశారు. సంస్థ ప్రయివేటీకరణకు వీలుగా లావాదేవీల సలహాదారున్ని కూడా నియమించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) విక్రయ ప్రక్రయను పర్యవేక్షిస్తుంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఫోర్జ్‌ వీల్‌ ఏడాదికి 80,000 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ''డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ట్రాక్‌లోనే ఉంది. మెరుగైన ఆర్థిక సాధ్యత కోసం సంస్థను ప్రయివేటు శక్తులకు బదిలీ చేసే ప్రణాళికలు కొనసాగుతున్నాయి. సుమారు 24 ఎకరాల భూమి మానిటైజేషన్‌ కూడా చేయబడుతుంది.'' అని ఓ అధికారి పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను అమ్మి తీరుతామని ఇంతక్రితం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, దీపమ్‌ సెక్రటరీ తూహిన్‌ కాంత్‌ పాండే పలు సార్లు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయానికి 2021 జనవరిలోనే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లే పనిలోనే తాము ఉన్నామని పాండే తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌ను ప్రయివేటుకు అమ్మనివ్వబోమంటూ వైజాగ్‌ స్టీల్‌ ఉద్యోగులు, కార్మికులు, అక్కడి ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయమూ తెలిసిందే.