Aug 31,2023 07:06
  • కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు సిపిఎం నేత బృందా కరత్‌ లేఖ

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ)పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు విధాన నిర్ణయాలతో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఆమె, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు ఒక లేఖ రాశారు. కార్మికుల హక్కులకు సంబంధించిన క్లాజులు, చట్టాన్ని ఖరారు చేయడంలో క్రియాశీలంగా పాల్గొన్న వ్యక్తిగా, డిమాండ్‌ ఆధారిత పనుల విషయంలో కార్మికుల హక్కులు రాజీ పడుతుండడంపై తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని బృందా కరత్‌ పేర్కొన్నారు. ఈ పథకం కింద జరిగే నిధుల కేటాయింపులు ఏమాత్రమూ సరిపోవడం లేదన్నారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో డేటా ప్రకారం కేటాయించిన వాటిలో 91శాతం నిధులు ఇప్పటికే ఖర్చు చేశారు. ప్రస్తుత సగటు పనిదినాలు కేవలం 35.4 రోజులుగా వున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం, ఆధార్‌ కార్డు ప్రాతిపదికగా చెల్లింపులు వంటి తప్పనిసరి నిబంధనలు, చట్టంలో పొందుపరిచిన బేషరతు హక్కులను ఆంక్షలతో కూడినవిగా మారుస్తున్నాయన్నారు. వేతనాల చెల్లింపులకు ఆధార్‌ను ప్రవేశపెట్టడం వల్ల వేతన చెల్లింపుల్లో పెద్దగా మార్పేమీ రాలేదన్నారు. దీనిపై ఒక సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు చూసినట్లైతే మొత్తంగా 26 కోట్ల మంది ఉపాధిదారుల్లో 41.1శాతం మంది ఈ తరహా చెల్లింపులకు ఇంకా అర్హులు కారని తేలింది. పెద్ద సంఖ్యలో ఉపాధి కార్మికులు వుండే ఐదు రాష్ట్రాల్లో 1.2కోట్ల మంది కార్మికులకు ఎబిపిఎస్‌ ఖాతాలు లేకపోవడంతో వారు చెల్లింపులకు అర్హులు కారని ఆ సర్వే నివేదిక పేర్కొంది. హిందూ పత్రిక ఈ నివేదికను బుధవారం ప్రచురించింది. చెల్లింపులకు పట్టే సమయం లేదా తిరస్కరణ శాతాలకు సంబంధించి చూసినట్లైతే ఎబిపిఎస్‌కు, సాధారణ ఖాతా లావాదేవీలకు గణాంకాల పరంగా చాలా కొద్ది తేడా వుందని ప్రభుత్వ డేటాను విశ్లేషిస్తే తెలుస్తోందని సర్వే పేర్కొంది. దీనివల్ల కార్మికులకు పెద్దగా లాభం లేకపోయినా నష్టాలు మాత్రం ఎక్కువగానే వున్నాయని ఆ లేఖ పేర్కొంది.
గత ఆరు మాసాలుగా తాను ఉపాధి హామీ పథకం కింద పని జరిగే ప్రదేశాల్లో పర్యటించానని, రాష్ట్రాల వారీగా కార్మికులతో మాట్లాడానని ఆమె చెప్పారు. పని జరిగే చోట నిర్దిష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో హాజరును నమోదు చేసుకోవడమన్నది ప్రధాన సమస్యగా వుందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ భారతంలో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీలో చాలా ఇబ్బందులు వుంటాయి. తప్పనిసరి ఆన్‌లైన్‌ నమోదు కావడంతో కార్మికులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని బృందాకరత్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో హాజరు నమోదు కోసం పనికి ముందు, అయిపోయిన తర్వాత అదనపు సమయం వుండాల్సి వస్తోందని, దీనివల్ల మహిళలు ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. హాజరు నమోదు కాకపోతే వేతనాలు తిరస్కరిస్తున్న సందర్భాలు వున్నాయన్నారు.
షెడ్యూల్‌ రేట్లు, పీస్‌ రేట్లు చాలా ఇబ్బందికరంగా మారాయని మహిళా కార్మికులతో మాట్లాడినప్పుడు చెప్పారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో, పని ప్రదేశాల్లో మహిళల పని నిబంధనలకు సంబంధించినంత వరకు చాలా తక్కువ రేట్లకే మహిళల శ్రమ దోపిడీ జరుగుతోందని స్పష్టమవుతోంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు జరిగే పని ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో జరిగిన సర్వేలను ఏ మంత్రిత్వ శాఖ ఉపయోగించుకోవడం లేదు. గతంలో అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సర్వేల తర్వాత మహిళల పని నిబంధనలను నిర్ణయించేవారు. దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆ లేఖలో ఆమె తెలిపారు. ఈ లేఖలో తాను లేవదీసిన అంశాలన్నింటిపై తగు చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.