- పశ్చిమబెంగాల్‌లో ఐద్వా ర్యాలీలో బృందా కరత్
కొల్‌కతా : పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ బీభత్సాన్ని ఎదుర్కొని మహిళలు సాగించిన పోరాటం యావత్ దేశానికే ఆదర్శమని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అఖిల భారత నాయకత్వం కొనియాడింది. మహిళా సంఘం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ శుక్రవారం రాణి రసమణి అవెన్యూలో 'ప్రతిఘటన ర్యాలీ'కి పిలుపునిచ్చింది. ఆ ర్యాలీలో వక్తలుగా సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇదే అసలైన ప్రతిఘటన' రోజు అని అభివర్ణించారు. ఇక్కడకు వచ్చిన వారిలో అమరవీరుల కుటుంబానికి చెందిన మహిళలు ఉన్నారు. తమ వారిని కోల్పోయి.. దుఃఖంలో ఉండి కూడా ఈ సభకు రావడానికి ధైర్యం చూపించారు. భవిష్యత్తులో పోరాటానికి అండగా ఉంటానని బృందాకరత్ వారికి భరోసా ఇచ్చారు. బెంగాల్ పోరాటం యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.పంచాయతీ ఎన్నికల్లో మహిళల పాత్రను ప్రశంసిస్తూ బందా కారత్ మాట్లాడుతూ.. ''మీరు పంచాయతీ ఎన్నికల్లో పోరాడి అభ్యర్థులుగా నిలిచారు. ఓటు వేసే వరకు పోరాటంలోనే ఉన్నారు. రకరకాల చిత్రహింసల తర్వాత పోరాటాన్ని విరమించుకోలేదు. కొన్ని చోట్ల గెలిచారు. ఇంకొన్ని చోట్ల ఓడిపోయారు. కానీ సీపీఐ(ఎం) దృష్టిలో మీరు గెలిచారు'' అని అన్నారు.
రాష్ట్రంలో తృణమూల్, బీజేపీ శక్తులకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడాలి. అంటే ''మీరు రెండు యుద్ధాలు చేయాలి'' అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కనినికా ఘోష్, మరియం ధావ్లే, పీకే శ్రీమతి తదితరులు ప్రసంగించారు.










