Aug 19,2023 09:26
  • సిఎం బీరెన్‌ సింగ్‌ను తొలగించాలి
  • మతృదేహాల కోసం కుటుంబాలు ఎదురు చూపులు
  • మణిపూర్‌ ఘటనల పట్ల రాష్ట్రపతి విచారం
  • సహాయక శిబిరాల్లో నెలకొన్న దుస్థితిపై ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ''మణిపూర్‌ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు న్యాయం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజ ేయడానికి మీరు అధికారాన్ని ఉపయోగించాలి'' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐద్వా అభ్యర్థించింది. శుక్రవారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఐద్వా నాయకులు బృందాకరత్‌, ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి టీచర్‌, మరియం ధావలే శుక్రవారం కలిశారు. మణిపూర్‌లో తమ పర్యటన అంశాలను వివరిస్తూ, వినతి పత్రాన్ని రాష్ట్రపతికి బృందాకరత్‌ అందజేశారు. లైంగిక వేధింపులు, ఇతర హింస బాధితులపై జరిగిన క్రూరత్వాల వివరాలను రాష్ట్రపతి విన్నారని, ఈ ఘటనలపై ఆమె విచారం వ్యక్తం చేశారని బృందాకరత్‌ తెలిపారు. తాను గవర్నర్‌తో పలుమార్లు మాట్లాడినట్లు రాష్ట్రపతి చెప్పారని, సహాయక శిబిరాల్లో నెలకొన్న దుస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.
 

                                                          మణిపూర్‌ ప్రజల వాణిని నివేదిస్తున్నాం

''ఆగస్ట్‌ 9-11 అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తరపున మా మూడు రోజుల పర్యటనలో మణిపూర్‌ బాధితులు వెళ్లబోసుకున్న గోడును మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అత్యాచార, లైంగిక వేధింపులకు గురైన మహిళలతో పాటు హింసను ఎదుర్కొంటున్న కుటుంబాలను కలుసుకున్నాం. వారు తమ అభద్రతా భావాన్ని, నిరాశను మీకు తెలియజేయాలని మమ్మల్ని అభ్యర్థించారు. మేము కలిసిన గవర్నర్‌ అనసూయ ఉయికే చాలా మంది బాధితులతో నేరుగా మాట్లాడారని, సంబంధిత అధికారులకు ఆమె సూచనలు చేసినా ఫలితం మిగతా 7లో లేకపోయిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదని, రాష్ట్రాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో ముఖ్యంగా మహిళలతో మమేకమైతేనే మణిపూర్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోగలం'' అని తెలిపారు.
 

                                                                      దు:ఖసాగరంలో మణిపూర్‌

''మణిపూర్‌ రాష్ట్రం దు:ఖసాగరంలో ఉంది. పరస్పరం శాంతి సామరస్యాలతో జీవించిన ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగుల్కొన్నాయి. ఇప్పుడు రెండు వైపులా భయం, అపనమ్మకం, అనుమానాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది ఆయా తెగలు నివసించే రెండు ప్రాంతాల మధ్య జాతీయ సరిహద్దులా మారింది. ఎవరినీ ఈ సరిహద్దును దాటడానికి అనుమతించరు. దాదాపు ఐదు వేల కాలనీలు, అనేక గ్రామాలు కాలిబూడిదయ్యాయి. ఇరు తెగలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సహాయక శిబిరాల్లో ఉన్నారు. ఆదివాసీలపై దాడులు మితిమీరుతున్నాయి'' అని పేర్కొన్నారు.
 

                                                                    మహిళల నరకయాతన

మణిపూర్‌లో అనాగరిక దాడులతో మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారని, వారికి న్యాయం చేయాలని ఆ మెమొరాండంలో ఐద్వా కోరింది. సామూహిక అత్యాచారం నుంచి కుమార్తెను, భార్యను రక్షించే క్రమంలో తండ్రి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. మీరు జోక్యం చేసుకుని కడచూపునకు నోచుకునే అవకాశం కల్పించాలని కోరింది.
 

                                                        ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

''ప్రజలను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ముఖ్యమంత్రిని తొలగించడం అత్యంత ఆవశ్యకమని ఐద్వా పేర్కొంది.
 

                                                                సహాయక శిబిరాల భయంకరమైన స్థితి

''మణిపూర్‌లోని 350 సహాయ శిబిరాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉన్నారు. మూడు నెలల నుంచి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో వారు ఈ సహాయక శిబిరాల్లోనే మగ్గుతున్నారు. అక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. వృద్ధులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అనేక ఇబ్బందులు పడు తున్నారు. శిబిరాలు మరుగుదొడ్లులా తయారవుతున్నాయి. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, విశ్రాంతి కోసం పడుకోవడం మొదలైన సాధారణ రోజువారీ కార్యకలాపాలు పెద్దలతో సహా అందరి ముందు చేయాలి. వారి ఆత్మగౌరవాన్ని, గౌరవాన్ని కోల్పోతున్నారు. కొండ ప్రాంతాల్లో ఇప్పటికీ పిల్లలు బడి బయటే ఉన్నారు. ఆహారం, పోషకాహారం అందటం లేదు. ప్రజలు మూడు నెలలుగా పప్పు, అన్నం మాత్రమే తింటున్నారు'' అని వివరించారు.
 

                                                        వందల కుటుంబాలు రోజుకు ఒక్కపూటే భోజనం

''ఈ సహాయక శిబిరాల్లో కాకుండా సొంత ఇళ్లలోనే ఉన్నవారు ఉపాధి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అనేక కుటుంబాలు రోజుకు ఒక్కసారే భోజనం చేస్తున్నాయి. రేషన్‌ ధాన్యాలు నిలిచిపోయాయి. కోవిడ్‌ కాలంలో ప్రారంభించిన ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు'' అని తెలిపారు.
 

                                                       తక్షణమే పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు

బాధితులకు న్యాయం జరగాలంటే ఈ దారుణాలకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా కోరింది. వీడియోలలో ఇప్పటికే గుర్తించబడిన వారిని కూడా అరెస్టు చేయలేదు. ఆస్తి దగ్ధం, దోపిడీ విషయంలో ఇరువైపులా జరిగిన నష్టాలను సరైన అంచనా వేసి తగిన పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కాలిపోయిన వారందరికీ పునరావాస ప్రక్రియ చేపట్టాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలి. రేషన్‌ కోటాలను ఒక్కొక్కరికి పది కిలోలకు పెంచాలి. భారీ నిరుద్యోగం, తీవ్రమైన ఆదాయ నష్టం ఉన్నందున నగదు బదిలీలు తక్షణం చేయాలి. విద్యార్థులందరి విద్యను పున్ణప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. వైద్య సదుపాయాలు క్షీణించిన గిరిజన ప్రాంతాలకు అత్యవసరంగా వైద్యులను పంపించాలి'' అని విజ్ఞప్తి చేశారు.