Sep 10,2023 22:15

అబద్ధాలు.. వక్రీకరణలతో కేంద్రంలో పాలన
బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకునేది ఎర్రజెండానే
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వార్షికోత్సవ సభలో బృందాకరత్‌
ప్రజాశక్తి -హైదరాబాద్‌బ్యూరో:కేంద్రంలోని ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విమర్శించారు. పూర్తి అబద్ధాలు, వక్రీకరణలు, విద్వేష ప్రసంగాలతో వారు దేశాన్ని పాలిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పార్కు వద్ద ఆదివారం సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో 'తెలంగాణ సాయుధ పోరాట (2946-51) వార్షికోత్సవాలు, తెలంగాణ విలీన దినోత్సవాలు' కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ కార్యదర్శి ఎమ్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బృందా కరత్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులమతాలతో సంబంధం లేకుండా, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కూడా ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. బిజెపి దాని అనుబంధ సంఘాలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, విభజన రాజకీయాలు చేస్తున్నారని, ఢిల్లీలో జరుగుతున్న జి-20 అంతర్జాతీయ సదస్సులో 'విద్వేషాలు వద్దు' అనే తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టి, ఆమోదించుకున్నారని ఎద్దేవా చేశారు. చెప్పే మాటకు, చేసే పనికి సంబంధమే ఉండదని అన్నారు. బ్రిటీషర్లకు సలాం కొట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌, సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఇప్పుడు తెలంగాణ విమోచన దినం జరుపుతామని బయల్దేరాయని ఎద్దేవా చేశారు. అనేక త్యాగాలతో కులమతాలకు అతీతంగా ఐక్యంగా జరిగిన పోరాట చరిత్రను మత ఘర్షణలుగా చిత్రీకరిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి దాని అనుబంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి చర్యల్ని సహించబోమని హెచ్చరించారు. కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి నేతల ఆదర్శాలు, స్ఫూర్తితో... మతోన్మాద శక్తులు, ప్రజాకంటక ప్రభుత్వాల బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకుంటామని, ఎర్రజెండా ఎప్పుడూ పేదల పక్షానే నిలుస్తోందని స్పష్టం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినంలో పాల్గనేందుకు అమిత్‌ షా, రాహుల్‌ గాంధీలకు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన వారే సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ వచ్చి వేడుకలు నిర్వహిస్తామని చెప్తున్నారని, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముందని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహారావు, టి జ్యోతి, సీనియర్‌ నాయకులు ఎస్‌ మల్లారెడ్డి, రఘుపాల్‌, పిఎస్‌ఎన్‌ మూర్తి, నంద్యాల నర్సింహారెడ్డి, తదితరులు పాల్గన్నారు. అంతకుముందు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీలో సాయుధ పోరాట చరిత్రను తెలుపుతూ ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ అనంతరం సుందరయ్య పార్కు నుంచి చిక్కడపల్లి మీదుగా ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.