Sep 27,2023 10:56

వహీదా రెహమాన్‌ తొలిసారి వెండితెరపై ఒకే ఒక్క పాటతో అద్భుతంగా మెరిసి, తెలుగు ప్రజల్లో చిరస్థానాన్ని పొందారు. అది రోజులు మారాయి సినిమాలోని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' పాట. దీనికన్నా ముందు ఆమె ఎన్టీఆర్‌తో కలిసి జయసింహ సినిమాలో నటించారు. అదింకా విడుదల కాకముందే - తాపీ చాణుక్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రోజులు మారాయి' సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో వచ్చే పాటలో నర్తించారు. పాట అద్భుతమైన వేగంతో, అందరికీ అర్థమయ్యే సాహిత్యంతో సాగుతుంది. అది రైతు జీవితానికి సంబంధించిన పాట. తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ పోరాటాలూ ఉధృతంగా సాగుతున్న కాలం. చక్కని జానపద బాణీలో కొసరాజు రాఘవయ్య ఈ పాటను సమకూర్చారు. మాస్టర్‌ వేణు స్వరాలు సమకూర్చారు. ప్రధాన నటులు నాగేశ్వరరావు, షావుకారు జానకి, ఇతర రైతులూ నాగళ్లకు ఎడ్లను పూన్చి, ఏరువాకకు సిద్ధమైన సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. డప్పుల దరువుల మధ్య చూడచక్కని అభినయం, కళ్లు తిప్పుకోనివ్వని హావభావాలతో వహీదా నర్తించింది. ఆ ఒక్క పాటతోనే ఎందరో అభిమానులను సంపాదించుకొంది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులను ఉత్తేజపరుస్తూ సాగే ఈ పాట సాగు ప్రక్రియనూ కళ్లకు కట్టిస్తుంది. రైతుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. ఈ పాట ఇప్పటికీ టీవీల్లోనో, ఎఫ్‌ఎం రేడియోల్లోనో హుషారుగా వినిపిస్తూనే ఉంటుంది. అయితే, రోజులు మారాయి, మారాలి అన్న ఆకాంక్షే ఇంకా నిజం కాకుండా ఉంది.