Oct 23,2023 10:16

దసరా వచ్చిందంటే చాలు, ఒకపక్క పండగ హడావిడి, మరోపక్క సినిమా సందడి ఉండనే ఉంటుంది. ఈసారి పండక్కి కూడా బడా హీరోలు బాక్సాఫీసు బరిలో పోటీపడ్డారు. బాలకృష్ణ, రవితేజ, విజరు వరుసగా నటించిన 'భగవంత్‌ కేసరి', 'టైగర్‌ నాగేశ్వరరావు', 'లియో' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యాక్షన్‌, సెంటిమెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కలయికతో వచ్చిన ఈ సినిమాలు ఎలా ఉన్నాయో క్లుప్తంగా చూద్దాం..

011

                                                                   భగవంత్‌ కేసరి

బాలకృష్ణ అంటేనే యాక్షన్‌ సినిమాలకు పెట్టిందిపేరు. కొంతకాలంగా ఆయన సినిమాల్లో అదే కనిపిస్తోంది మరి. ఊచకోత, హింస, రక్తపాతం ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతూ ఉంటాయి. అయితే ఈసారి దర్శకుడు అనిల్‌ రావిపూడి బాలకృష్ణతో సినిమా ప్రకటించగానే ఆయన అభిమానులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాల్లో అందెవేసిన చేయిగా అనిల్‌కి పేరుంది. అలాంటి దర్శకుడు యాక్షన్‌ హీరో బాలకృష్ణను తెరపై ఎలా చూపిస్తాడోనని చాలామంది ఎదురుచూశారు. అయితే అభిమానులను ఎంతమాత్రం నిరాశపర్చకుండా ఒకపక్క యాక్షన్‌ చూపిస్తూనే, మరోపక్క సమాజానికి మంచి సందేశం ఇచ్చే సన్నివేశాలతో ఈ సినిమా ఉంది. బాలకృష్ణ తండ్రిపాత్రలో మెప్పించారు. కూతురు పాత్రలో నటించిన శ్రీలీలకు కూడా మంచి మార్కులే పడ్డాయి. 'ఆడపిల్లను సింహంలా పెంచాలి', 'గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై బాలకృష్ణ స్కూలులో చెప్పే వివరణ'పై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. స్నేహితుని కూతురును ఉన్నత లక్ష్యం వైపు నడిపించే తీరు, భగవంత్‌ కేసరి ఫ్లాషబ్యాక్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. బాలకృష్ణ సినిమాలన్నీ ఆయన ఒంటిచేత్తో నడిపిస్తారు. ఫైట్లు, పాటలు ఆయన కోసమే అన్నట్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీపడి శ్రీలీల నటించింది. ఒక సీనియర్‌ హీరో పక్కన నటనకు ఆస్కారమున్న పాత్రలో మెప్పించింది. అంతేకాక కైమాక్స్‌లో ఆమెతో చేయించిన పోరాట సన్నివేశం అందరినీ అలరిస్తుంది. కథ, కథనం, తెరకెక్కించిన విధానం బట్టే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. కమర్షియల్‌ సినిమాల్లో, పెద్ద హీరోల సినిమాల్లో సమాజాన్ని చైతన్యం చేసే సందేశాలు ఈ మధ్య అప్పుడప్పుడూ కనిపిస్తున్నా ఈ సినిమాలో అనిల్‌ స్పృశించిన అంశాలు మాత్రం ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి.

raviteja

                                                                   టైగర్‌ నాగేశ్వరావు

అగ్రహీరోల హవా నడుస్తున్నా రవితేజ సినిమాలకు మాత్రం పక్కా గ్యారంటీ అభిమానులు ఉంటారు. తన సినీ కెరియర్‌లో తొలిసారి రవితేజ ఓ బయోపిక్‌కి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. లక్ష్మీ మంచు 'దొంగాట', రాజ్‌ తరుణ్‌ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' వంటి చిన్న సినిమాలతో ఇండిస్టీలో మంచి పేరు తెచ్చుకున్న వంశీ స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితకథ మొదట బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి వినిపించినా డేట్స్‌ కుదరక రవితేజ దగ్గర లాక్‌ అయ్యింది. 1970 నాటి మోస్ట్‌ వాంటెడ్‌ దొంగైన స్టువర్టుపురం నాగేశ్వరరావుపై చాలాకాలం స్టడీ చేసి ఈ సినిమా తెరకెక్కించానని వంశీ పలు ఇంటర్వ్యూలో చెప్పారు. రేణుదేశారు వంటి సీనియర్‌ హీరోయిన్‌తో హేమలతా లవణం వంటి సామాజిక కార్యకర్త పాత్ర చేయించామని చెప్పారు. నాగేశ్వరరావు దొంగలా ఎలా మారాడు? ఎంత చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు? చెప్పి దొంగతనం చేయడంలో నేర్పరి, తన ఊరు, జనాల కోసం ఆయన పడే తపన తెరమీద చూపించాలనే ఈ సినిమా తీశానని వంశీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే వెండితెరపై అవేమీ కనిపించలేదననే విమర్శ ఉంది. రేణుదేశారు పాత్ర నిడివి తక్కువ. సినిమాలో ఆమె ప్రభావం ఏం లేదు. నాగేశ్వరరావు దొంగతనాలు చాలా చాకచక్యంగా చేసేవాడని చెప్పుకొచ్చినా వాటిని తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. జనాలకు మంచి చేసే దొంగగా నాగేశ్వరరావును చూపించే ప్రయత్నం చేసినా ఆ సన్నివేశాలేమీ పెద్దగా అలరించవు. రవితేజ మంచి ఈజ్‌ ఉన్న నటుడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. తన పాత్ర వరకు రవితేజ న్యాయం చేసినట్లే. కానీ కథనం కాస్త గాడి తప్పింది. పతాక సన్నివేశాలు కూడా సో సో గా సాగుతాయి. సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఇంకొంచెం బెటర్‌ అయితే బాగుండేది.

lio

                                                                             లియో

తమిళ నటుడు విజరుకి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. లోకేష్‌ కనగరాజ్‌కి కూడా ప్రత్యేక ఫాన్‌ బేస్‌ ఉంది. హీరో ఎలివేషన్‌, యాక్షన్‌ సన్నివేశాలకు లోకేష్‌ పెట్టింది పేరు. సినిమా ఆరంభంలో మొదటి 15 నిమిషాలు అసలు మిస్‌ కాకండి అంటూ లోకేష్‌ ఇచ్చిన మెసేజ్‌కి తగ్గట్లుగానే హైనాతో విజరు పోరాటం మెప్పిస్తుంది. యాక్షన్‌తో పాటు ఈసారి ఒకింత సెంటిమెంట్‌ కూడా టచ్‌ చేశాడు దర్శకుడు. 'ఖైదీ', 'విక్రమ్‌' మాదిరి లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సియు)లో భాగంగానే 'లియో' తెరకెక్కిందని అందరూ భావించారు. మొదటి రెండు సినిమాల్లో మాదిరి క్లైమాక్స్‌్‌ సన్నివేశంలో కమల్‌ కామియో పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ సినిమాలకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌ ఈ పాత్రకు రాలేదు. సంజరుదత్‌, అర్జున్‌, త్రిష పాత్రలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. లియోగా యాక్షన్‌ సన్నివేశాల్లో, ఓ బిడ్డ తండ్రిగా పార్తీబన్‌ పాత్రలో విజరు నటన బాగుంది. లోకేష్‌, విజరు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది.