సినిమా ఇండిస్టీలో ఎప్పుడు ఎవరు కనిపిస్తారో...ఎప్పుడు మాయమవుతారో తెలియదు. వెండితెరపై ఒకప్పుడు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఓలలాడించిన నటీనటులు ఆ తర్వాత కాలంలో కనిపించకపోవటం తెలిసిందే. ఇలాంటి వారిలో హీరోయిన్లే ఎక్కువమంది ఉంటారు. ఇక పెళ్ళిళ్లు, కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు, ఇతరత్రా వ్యవహరాల్లో ఉంటూ ఇండిస్టీకి దూరంగా ఉంటున్న వారు కూడా ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత నటనపై తమకున్న ఆసక్తితోగానీ, సినిమాల్లో వచ్చిన అవకాశాలతో గానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో తమ ప్రతిభను నిరూపించుకునేందు సిద్ధమవుతున్న తారలూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ కన్పిస్తున్నారు. ఇలాంటి వారిలో సీనియర్ హీరోయిన్లు భూమిక, జెనీలియ, స్నేహ, లైలా, సదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న విషయం తెలిసిందే.
కీర్తిరెడ్డి : పవన్‌కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రంలో అను పాత్రధారిగా కీర్తిరెడ్డి నటించారు. గన్ షాట్, ప్రేమించే మనసు, రావోయి చందమామ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. మహేష్ నటించిన 'అర్జున్'లో మీనాక్షిగా మహేష్‌కు సోదరి పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రాలన్నీ నిరాశే మిగల్చటంతో ఇండిస్టీకి దూరమయ్యారు. కీర్తిరెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.
లయ : విజయవాడకు చెందిన లయ దాదాపుగా 35 సినిమాల్లో నటించారు. వీటిలో తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు ఉన్నాయి. 'భద్రం కొడుకో'లో బాలనటిగా నటించారు. స్వయంవరం సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆమె ఉత్తమ నటిగా మనోహరం (2000), ప్రేమించు(2001) చిత్రాలకు వరుసగా రెండు నంది అవార్డులను గెలుచుకున్నారు. సినిమాల్లో బాగా నటిస్తున్న సమయంలోనే ఆమె అమెరికాకు చెందిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు.
ప్రియమణి : 2007లో పరుత్తివీరన్‌లో నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన ప్రియమణి 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన యమదొంగ బాగా హిట్ అయ్యింది. తెలుగులోనే కాదు తమిల్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా షారూక్‌ఖాన్ నటించిన 'జవాన్' సినిమాలోనూ నటించారు. తెలుగులోనే కాకుండా తమిల్, కన్నడ, హిందీ, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతోపాటు టీవీ షోల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ 'నెరు' సినిమాలో ప్రియమణి నటిస్తున్నారు.
స్నేహ : ఒకప్పటి తెలుగు నటి స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తొలివలపు సినిమాతో తెలుగు సినీ ఇండ్రస్టీకి పరిచయమయ్యారు. ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, మలయాళ బాషల్లోనూ నటించారు. నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే పలు సినిమాలు చేశారు. మరికొన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
సదా : 2002లో వచ్చిన జయం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సదా. ఆమె కథనాయికగా పరిచయం అయిన సినిమా కూడా అదే. ఈ సినిమాలో నటకు ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం అందుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో నటించిన ప్రేక్షకులను అలరించారు. ఒక హిందీ సినిమాలో నటించిన సదా కొన్ని మలయాళ సినిమాల్లో అతిథి పాత్రలను పోషించారు. డీజె టిల్లు మూవీ సీక్వెల్ టీజె టిల్లు మూవీలో సదాను ఒక కీలక పాత్రకు ఎంపిక చేసినట్లుగా సమాచారం.
భావన : 2008లో హీరో గోపీచంద్ నటించిన 'ఒంటరి' అనే చిత్రం ద్వారా తెలుగు సినిమారే హీరోయిన్గా పరిచయమైన మలయాళ బ్యూటీ 'భావన'. వరుసగా నితిన్, శ్రీకాంత్, రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది. 2018లో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత 'నవీన్'ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. రవితేజ సినిమాలో అవకాశం దొరికినట్లుగా సమాచారం.
లైలా : ఎగిరే పావురమా సినిమాతో ఆకట్టుకున్న నటి లైలా. అనతికాలంలోనే స్టార్ హీరోలతో నటించింది. ఆపై తమిళంలోనూ అడుగుపెట్టింది. విక్రమ్, సూర్య లాంటి నటులతో నటించి పేరుతెచ్చుకుంది. ఆపై పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడింది. తొమ్మిదేళ్ల తర్వాత దర్శకుడు బాలా తన కొత్త చిత్రంలో కీలకపాత్రలో నటించాలంటూ సందేశం పంపారట. ప్రస్తుతం శబ్దం అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ పాత్ర రావడం కోసం అనేక టీవీ షోల్లో కనిపించింది.