- ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో
- స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు
హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అంచనాలకు తగ్గట్టుగానే రాణించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 25ఏళ్ల నీరజ్ ఈటెను 88.17మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అందని ద్రాక్షగా ఉన్న స్వర్ణ పతకాన్ని భారత్‌కు ఖాయం చేసి నయా చరిత్ర సృష్టించాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు దక్కిన ఏకైక పతకం నీరజ్ సాధించినదే. నీరజ్ సాధించిన ఏకైక స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలోనే ఫైనల్‌కు చేరిన కిషోర్ కుమార్ జెనా(84.77మీ.) 5వ, డిపి మను(84.14మీ.) 6వ స్థానాల్లో తమ తమ స్థాయిలకు తగ్గ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హర్యానాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా 17మంది ఉన్న ఉమ్మడి కుటుంబ సభ్యులు ఒకడు. చిన్న వయసులోనే 90కిలోల బరువున్న నీరజ్.. కేవలం బరువు తగ్గడం కోసం తండ్రి ఒత్తిడి మేరకు జాగింగ్‌కు ఉపక్రమించాడు. ఓ పర్యాయం అనుకోకుండా ఈటెను చేతబట్టి సుమారు 35 నుంచి 40మీటర్లు విసిరాడు. శిక్షణ పొందితే మరింత రాణించవచ్చని స్నేహితులు ప్రోత్సహించడంతో క్రమంగా ఈ క్రీడాంశంపై ఆసక్తితో పెంచుకొన్నాడు. శిక్షణా కాలంలోనే బరువునూ తగ్గించుకున్నాడు. 2013 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్, 2015 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా.. పతకాలు సాధించలేకపోయాడు. 2016లో జరిగిన దక్షిణ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాదే ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. ప్రపంచ అండర్-20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే కాదు.. జావెలిన్‌ను 86.48 మీటర్లు విసిరి తొలిసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణంతో నయా చరిత్ర
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గత ఏడాది జరిగిన డైమండ్‌లీగ్‌లో స్వర్ణం, అంతకుముందు ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ రికార్డు పుటల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రీడల్లో ఏడు స్వర్ణాలు సాధించిన నీరజ్.. జావెలిన్ త్రో విభాగంలో కొత్త చరిత్రను సృష్టిస్తున్నాడు.
ప్రధాని శుభాకాంక్షలు..
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్‌లో 'ప్రతిభకు నువ్వే నిదర్శనం' అని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక జావెలిన్ త్రో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జెలెంజిక్(చెక్; 98.48మీ.) భవిష్యత్తులో నీకు తిరుగులేదనంటూ ట్వీట్ చేశాడు.
నీరజ్ సాధించిన పతకాలు..
- 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ : స్వర్ణం
- 2022 డైమండ్ లీగ్ : స్వర్ణం
- 2022 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ : రజతం
- 2020 టోక్యో ఒంలింపిక్స్ : స్వర్ణం
- 2018 ఆసియా గేమ్స్ : స్వర్ణం
- 2018 కామన్వెల్త్ గేమ్స్ : స్వర్ణం
- 2017 ఆసియా ఛాంపియన్‌షిప్ : స్వర్ణం
- 2016 దక్షిణ ఆసియా గేమ్స్ : స్వర్ణం










