Aug 25,2023 22:16

పారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత
బుడాపెస్ట్‌(హంగేరీ): భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ జావెలిన్‌ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జరిగిన గ్రూప్‌-ఎ జావెలిన్‌ త్రో క్వాలిఫయర్స్‌లో విభాగంలో తొలి ప్రయత్నంలోనే 88.77మీటర్లు త్రోయర్‌ చేసి నీరజ్‌ ఫైనల్లో చోటు దక్కించుకున్నాడు. ఫైనల్‌కు చేరడం ద్వారా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కూ బెర్త్‌ సాధించాడు. ఇక గ్రూప్‌లో ఆర్షాద్‌ నదీమ్‌(పాకిస్తాన్‌) 86.79మీ., జాకబ్‌ విడ్లెచ్‌(చెక్‌) 83.50మీ. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక భారత్‌కే చెందిన డిపి మను (81.31మీ., కిషోర్‌ జెనా (80.55మీ.) ఒలింపిక్‌ కటాప్‌ మార్క్‌ 83మీటర్లను చేరుకోకున్నా ఫైనల్‌కు చేరారు. మను తొలి రౌండ్‌లో 78.10 మీటర్లు విసరగా.. రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 72.40 మీటర్లకు పడిపోయాడు. అయితే గ్రూప్‌ాఎ నుంచి నీరజ్‌ క్వాలిఫై కాగా.. జర్మనీకి చెందిన జులియన్‌ వెబర్‌ (82.39 మీటర్లు), మను (81.31 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. గ్రూప్‌-బి నుంచి పాకిస్థాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ అగ్రస్థానంతో అర్హత సాధించాడు. ఆదివారం జావెలిన్‌ త్రో ఫైనల్‌ జరగనుండగా మొత్తం 12మంది త్రోయర్లు పతకాలకు పోటీపడనున్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో హెలాండర్‌, వాద్లెచ్‌, డేవిడ్‌ వాగెర్‌, నీరజ్‌ చోప్రా, ఆడ్రియన్‌ మార్డరె, ఇహాబ్‌ అబ్దల్‌రహ్మాన్‌, అర్షద్‌ నదీమ్‌, డిపి మను, ఎడిస్‌ మటుసెవిస్‌, వెబర్‌, కిషోర్‌ జెనా, హెర్మన్‌ పోటీ పడనున్నారు. నీరజ్‌ చోప్రాకు వాద్లెచ్‌, వెబర్‌, అర్షద్‌ నదీమ్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.