
హైదరాబాద్: దేశంలో విచ్ఛిన్న శక్తులు రాజ్యమేలుతున్నాయని..ఇందుకోసం మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏచూరి పాల్గొని మాట్లాడారు. జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. విద్యార్థి దశలో జైపాల్‌రెడ్డిని తాను మొదటిసారిగా కలుసుకున్నానని, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఇద్దరూ కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఏ సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారో.. అవి ఇప్పటి రాజకీయాల్లో లోపించాయన్నారు. చివరి వరకు విలువలకు కట్టుబడి పనిచేసిన నాయకుడు జైపాల్ రెడ్డి అని.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటని అన్నారు. దేశంలో విచ్ఛిన్న శక్తులు రాజ్యమేలుతున్నాయని.. వాటి నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.