May 01,2023 08:49

      పద్మశ్రీ నటరాజ రామకృష్ణ 1933లో ఇండోనేషియాలో గల కలల దీవిలో ఒక సంపన్న ప్రవాసాంధ్ర కుటుంబంలో 1928 మార్చి 21న జన్మించారు. ఆయన పూర్వీకులది తూర్పు గోదావరి జిల్లా రాజోలు, అమ్మమ్మ ఊరు నల్లగొండ జిల్లాలో ఒక గ్రామం. తండ్రి రాంమోహన్‌ రావు, తల్లి సమయం మంచి వీణా విద్వాంసురాలు. ఆమెకు అనేక కళల్లోనూ పరిచయం ఉండేది. రామకృష్ణకు మూడేళ్ల వయసులోనే తల్లి మరణించారు. దీంతో రామకృష్ణను మద్రాసులోని రామకృష్ణ మిషను చదువు నిమిత్తం పంపించారు. నృత్యంపై బాల్యం నుంచి మక్కువ ఎక్కువ, కాని వారి తండ్రికి నచ్చేది కాదు. ఆ రోజుల్లో సమాజంలో నాట్యకళను నిషేధించారు. కాని నటరాజ రామకృష్ణ గారికి నాట్యం అంటే ఎనలేని ప్రేమ. కళ కోసం కుటుంబాన్ని, ఆస్తిని కూడా విడిచిపెట్టారు. వారు పేదరికం వల్ల కళ కోసం తపనతో ఎన్నో ఇబ్బందులు అలాగే ఒడిదుడుకులకు గురికావాల్సి వచ్చింది.
       నాట్యం పట్ల తన అంతర్గత కోరికను నెరవేర్చుకోవడానికి రామకృష్ణ మీనాక్షి సుందరం పిళ్లై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, నాయుడుపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ వంటి గొప్ప గురువుల వద్ద శిష్యరికం చేసి వివిధ నాట్య రీతులు నేర్చుకున్నారు. రామకృష్ణ అన్నయ్య శ్యామసుందరుడే తన నాట్య గురువు. ఒకరోజు నాగ్‌పూర్‌లో నృత్య ప్రదర్శనను చూసి బండార రాజుకు రామకృష్ణ గారిని డాక్టర్‌ సోనక్‌ వర్తమాన నర్తకుడిగా పరిచయం చేశారు. నాగ్‌పూర్‌లోని ప్రముఖులతో కూడిన రాజసభ ముందు రామకృష్ణ తన అసమానమైన ప్రదర్శనతో వాళ్ళను మంత్రముగ్ధులను చేశారు. ఈ ప్రదర్శన ఆయన జీవితంలో నిజమైన మలుపు.
         రామకృష్ణ నాట్యశాస్త్రంలో నిరంతర అధ్యయనం ద్వారా తన మనోధర్మాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో నృత్యంపై అతని వాగ్ధాటి ప్రేక్షకులను ఆకట్టుకునేది. రామకృష్ణ సరస్వతీ మహల్‌ గ్రంథాలయంలో దొరికిన సంగీతం, నృత్యానికి సంబంధించిన పాత రాతప్రతులను అధ్యయనం చేసిన అపర పరిశోధకుడు. 'జాయప సేనాని' రాసిన 'నృత్య రత్నావళి'ని పరిశోధించి, 'రామప్ప'లోని మృదంగ భంగిమల్ని పరిశీలించారు. ప్రతి శబ్దానికి ఉత్పత్తి, పరాకాష్ట, అంతర్థానం అనే మూడు దశలుంటాయని, ఆ నాధోత్పత్తి, విజృంభణ నిశ్శబ్దతలను గురించి వివరంగా తెలిసి ఉన్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నటరాజ రామకృష్ణ 'పేరిణి' నృత్యానికొక సజీవ రూపకల్పన చేసి మన ముందుంచారు. 10వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజవంశం యొక్క నృత్య సంప్రదాయమైన 'పేరిణి' అని పిలువబడే దీర్ఘకాలంగా మరచిపోయిన పోరాట కళను పునర్నిర్మించారు. దీన్నే 'పేరిణి శివతాండవం' అని కూడా పిలుస్తారు. ఇది ఇప్పుడు యువతలో బాగా ప్రాచుర్యం పొందింది.
        బౌద్ధ కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న నృత్య రీతి ఆంధ్రనాట్యాన్ని ఆయన పునరుద్ధరించారు. ఈ నృత్యాన్ని వ్యవహారంలో కచేరీ, కేళిక దర్బారు, మేజువాణి మొదలైన పేర్లతో పిలిచేవారు. నృత్యం, అభినయం రెండూ ఈ ప్రాచీన నృత్యంలో కనిపిస్తాయి. ఈ నాట్యంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భామా కలాపం, గొల్ల కలాపం. నిద్రాణ స్థితిలో ఉన్న ఈ కళను (పేరిణి,ఆంధ్ర నాట్యాన్ని) అభివృద్ధి చేశారు. మన రిపబ్లిక్‌ వేడుకల్లో, అప్నా ఉత్సవంలో చిందు యక్ష గానం ప్రదర్శితం కావటానికి నటరాజ రామకృష్ణ కృషి ఉంది. తెలంగాణ పల్లెల్లో దళిత జీవనంలో సజీవంగా ఉన్న ప్రాచీన చిందు యక్షగానాన్ని ప్రాచుర్యంలోకి తేవటానికి నటరాజ అవిరళ కృషి చేశారు. వివిధ జిల్లాల్లో 20 వేల మంది కళాకారులున్నారని లోకానికి చాటారు. శ్రీకాకుళం- విజయనగరం ప్రాంతపు తప్పెటగుళ్లు, ఉభయ గోదావరి జిల్లాల వీరనాట్యం, గరగలు ప్రాచుర్యంలోకి రావటంలో కూడా రామకృష్ణ కృషి ఉంది. దొమ్మరులు శరీర విన్యాసాల విశిష్టతలను ఆయన అక్షరబద్ధం చేశారు. శివపార్వతులను గానం చేసే గురవయ్యలు, ఉరుములు తెగలవారిని 18 రోజుల్లో 18 పర్వాల మహాభారతాన్ని ప్రదర్శించే చిత్తూరు జిల్లా వీధిభాగవతులైన కొట్టండ్లు గురించి, కూచిపూడి భాగవతుల గురించి అధ్యయనం చేశారు.
         1955లో బాలబాలికలకు నృత్యంలో శిక్షణ ఇవ్వడానికి ఈ కళను ప్రచారం చేయడానికి హైదరాబాదులో నృత్యనికేతన్‌ని స్థాపించి అనేకమంది కళా శిష్యులను తయారు చేశారు. రాష్ట్రంలో నాట్యకళకు సేవలందిస్తున్న అనేక సాంస్క ృతిక సంస్థలు వారి ప్రోత్సాహాన్ని పొందాయి. కేంద్ర సంగీత అకాడమీ కూచిపూడి నాట్యాన్ని సాంప్రదాయ కళారూపంగా గుర్తించడానికి నిరాకరించింది. దీంతో నటరాజ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కన్వీనర్‌గా ఒక సదస్సు నిర్వహించారు. దేవదాసి కళాకారులతో 'అభినయ' అనే సంస్థను నెలకొల్పారు. 1972లో రాజమండ్రిలో ఒక సెమినారు నిర్వహించి రెండు వేల ఏళ్ల చరిత్ర ఆలయ నృత్యాలపై సిలబస్‌ రాయించారు. ఈ ప్రయత్నమే తర్వాత కాలంలో ఆంధ్రనాట్యంగా ఫలవంతమైంది. తూర్పు తీర ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న 'తూర్పు భాగవతం' తెలుగు వారందరికీ తెలిసేలా అకాడమీ ద్వారా ప్రోత్సాహాన్నిచ్చారు. వృద్ధ దేవదాసీలకు 'అమ్మా' అంటూ నటరాజ ఆత్మీయంగా ఆదరించారు.
         నటరాజ రామకృష్ణ 15 ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రభలో 'నత్యాంజలి' శీర్షికతో అనేక వ్యాసాలు రాశారు. తర్వాత వాటిని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఇతర పత్రికల్లోనూ ఆయన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 41 పుస్తకాలను రాశారు. ఆయన రాసిన ఆరు పుస్తకాలు రాష్ట్ర కేంద్ర అవార్డులను గెలుచుకున్నాయి. భారతీయ నృత్యం సారాంశం, 'ఆత్మ' సందేశం అయిన 'అభినయ'ని వారు ప్రచారం చేశారు. నటరాజు కన్వీనర్‌గా రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించి శాస్త్రీయ కళారూపంగా ఆమోదం పొందేలా చేసి కూచిపూడి నృత్య గత వైభవాన్ని పునరుద్ధరించారు. కూచిపూడి అభివృద్ధి, ప్రచారం కోసం వారు అనేక పద్ధతులను సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో తూర్పు భాగవతంపై మరింత ప్రాచుర్యం తెచ్చి పేద కళాకారులను ప్రోత్సహించేందుకు సదస్సు నిర్వహించారు. నృత్యంపై పురాతన రాతప్రతులను సేకరించి భారతీయ నాట్యకళకు ఆత్మ అయిన సాత్వికాభినయాన్ని అభ్యసించిన కళాకారుడు నటరాజ రామకృష్ణ. ఆంధ్ర విశ్వవిద్యా లయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఇంకా అనేక సత్కారాలు సన్మానాలు బిరుదులు పొందారు. తన నృత్యకళకే అంకితం చేసిన కళాజీవి నటరాజ రామకృష్ణ.

- రేగుళ్ళ మల్లికార్జునరావు,
సంచాలకులు, భాషా సాంస్క ృతిక శాఖ,
ఆంధ్రప్రదేశ్‌, 94916 59899