Nov 07,2023 09:52

న్యూఢిల్లీ : గాజాలో ఇజ్రాయిల్‌ నిరంతర బాంబు దాడులు సాగిస్తోంది. ఇజ్రాయిల్‌ ఆక్రమణకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తున్నది. పాలస్తీనీ యులపై సాగిస్తున్న మారణకాండను తక్షణమే ఆపాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమెరికా సామ్రాజ్యద చర్యలకు వ్యతిరేకంగా మంగళవారం నుంచి నుండి ఈ నెల 10వ తేది వరకు దేశవ్యాపితంగా నిరసనకార్యక్రమాలు చేపట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. భారత రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ మంగళవారం నుండి మూడు రోజులపాటు భారత్‌లో ఉంటారు. ఈ సమయంలోనే అయిదు వామపక్ష పార్టీలు దేశవ్యాపిత నిరసనలకు పిలుపునిచ్చాయి. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా అమెరికా చర్యలు తీసుకోవాలని, పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ రక్షణ బలగాలకు నిధులు ఆయుధాల సరఫరాను వెంటనే ఆపాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా,ఎఐఎఫ్‌బి నేత జి.దేవరాజన్‌, సిపిఐ (యంఎల్‌)నేత దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి నేత మనోజ్‌ భట్టాచార్య సోమవారం నాడిక్కడ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలజేశారు. పాలస్తీనియన్లపై అమెరికా- ఇజ్రాయిల్‌ జరిపే ఊచకోతకు మద్దతునివ్వడం ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని కోరాయి. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని అంతర్జాతీ య సమాజం ఇస్తు న్న పిలుపులో భాగస్వామ్యం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. నిరసనలు, ఆందోళనలకు సంబం ధించిన విధి విధానాలను వామపక్ష పార్టీల రాష్ట్ర శాఖలు నిర్ణయిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు.