- సెంటు స్థలం పేరుతో ప్రజా ధనం లూటీ
- దోపిడీదారులకు కొమ్ముకాస్తున్న వైసిపి
- బహిరంగ సభలో నారా లోకేష్
ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశామని, జగన్మోహన్‌రెడ్డి పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం ప్రారంభమైంది. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఒక్క గుంత కూడా పూడ్చలేకపోయారని విమర్శించారు. రోడ్ల మీద గుంతల్లో వరి నాట్లు నాటి కొందరు, చేపలు పడుతూ కొందరూ నిరసన తెలుపుతున్నారని అన్నారు. సంక్షేమానికి కేేరాఫ్ అడ్రస్ టిడిపి అయితే, దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా వైసిపి ఉందని విమర్శించారు. టిడిపి హయాంలో అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, పండుగ కానుకలు ఇచ్చారని, రైతులకు రుణాలు మాఫీ చేశారని తెలిపారు. సెంటు స్థలాల పేరుతో రూ.7 వేల కోట్ల ప్రజాధనాన్ని జగన్ లూటీ చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, ఇప్పుడు ఇళ్లు కట్టకపోతే పట్టా లాక్కుంటున్నారని అన్నారు. దేశంలో వంద సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన మొదటి సిఎం జగన్మోహన్‌రెడ్డి అని విమర్శించారు. మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కొట్టేశారని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మోసం చేశారని అన్నారు. దోపిడీదారులకు వైసిపి కొమ్ము కాస్తోందని విమర్శించారు. పాదయాత్రలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌రావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.










