ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : సిఎం రోడ్డు తరహాలోనే నందిగామలో అన్ని ప్రధాన రహదారులను విస్తరించి, అభివృద్ధి చేస్తామని , నవనందిగామ నిర్మాణమే తమ ధ్యేయం అని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు.
నందిగామ పట్టణంలోని చందర్లపాడు రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. సిఎస్‌ఆర్ నిధులు రూ.కోటి అంచనా వ్యయంతో గాంధీ సెంటర్ నుండి చందాపురం బైపాస్ వరకు రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఎంఎల్‌ఎ తెలిపారు. పట్టణంలోని 12వ వార్డు అయ్యప్పస్వామి గుడి వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. గడపగడపకు -మన ప్రభుత్వం నిధులు రూ.16.60 లక్షల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు, వార్డులలో అభివృద్ధి పనులకు ఒక్కో సచివాలయ పరిధిలో రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం - అభివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన సాగుతుందన్నారు. ప్రజలలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దుష్ట శక్తులు మొత్తం ఏకమై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం, ఎఇ ఫణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ లు మాడుగుల నాగరత్నం, ఓర్సు లక్ష్మి, కౌన్సిల్ సభ్యులు సాంబయ్య, కిరణ్, యాకూబ్ వలి, శ్రీకాంత్, ఏఎంసి వైస్ చైర్మన్ మురళి, కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వీసం దుర్గారావు, కో ఆప్షన్ సభ్యులు దాసు, జాఫర్, నాయకులు మండవ పిచ్చయ్య, మహమ్మద్ అమీన్, పాములపాటి రమేష్, షేక్ ఫాతిమా, కృపారావు, కోమటి రవికుమార్, నరేంద్ర, సారధి, బండారు శేషు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










