Jan 09,2023 10:17
  • కళ్ల ముందే పంట దెబ్బతింటుండడంతో రైతులు కన్నీరుమున్నీరు
  • దున్నేయడం తప్ప వేరే దారి లేదంటూ ఆవేదన

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : మిర్చి పంటపై నల్లి పురుగు దాడి చేస్తుండడంతో రైతులు విలవిలలాడుతున్నారు. చేతికి అందివస్తున్న దశలో పంట కళ్లముందే దెబ్బతినడం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. గతేడాదీ నల్లి పురుగు దాడికి మిర్చి రైతులు తీవ్ర నష్టాలను చూవిచూశాడు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. ఈ పురుగును అదుపు చేసేందుకు మందులు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
            ఏలూరు జిల్లాలో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. ఏటా సెప్టెంబర్‌లో సాగును ప్రారంభిస్తారు. మార్చికి పూర్తి స్థాయిలో పంట చేతికొస్తుంది. ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ దశలో నల్లి పురుగు విజృంభనతో పూత మొత్తం రాలిపోతోంది. మొక్కలు కుచించుకుపోతున్నాయి. పురుగు మందులు వాడినా ప్రయోజనం లేకుండా ఉందని రైతులు వాపోతున్నారు. ఎకరా విస్తీర్ణంలో మిర్చి సాగుకు రూ.లక్ష వరకూ పెట్టుబడి అవుతోంది. నల్లి తెగులు సోకడంతో వారానికి రెండు, మూడుసార్లు పురుగుమందులు అదనంగా పిచికారీ చేయాల్సి వస్తోందని, దీనివల్ల అదనంగా రూ.50 వేల వరకూ ఖర్చవుతోందని రైతులు చెప్తున్నారు. పంట సవ్యంగా పండితే ఎకరాకు 25 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. నల్లి తెగులుతో రెండు నుంచి మూడు క్వింటాళ్లు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీనిపై జిల్లా ఉద్యాన శాఖాధికారి పాండురంగరావును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
 

                                                            కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరం

మిర్చి సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎకరాకు రూ.30 వేలు కౌలు, దాదాపు రూ.లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. నల్లితెగులతో పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో మిర్చి రైతులు గతేడాది ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఎకరాకు రూ.19 వేలు పరిహారం అందించింది. భూయజమానులకే పరిహారం అందింది.
            వాస్తవ సాగుదారుడైన కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందలేదు. ఈ ఏడాదీ ఇ-క్రాఫ్‌లో భూయజమానుల పేర్లనే అధికారులు నమోదు చేశారు. ఈసారైనా తమకు న్యాయం చేయాలని కౌలురైతులు కోరుతున్నారు.

                                                                     పూత మొత్తం రాలిపోతోంది

రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. ఎకరానికి కౌలు కాకుండా లక్షన్నర రూపాయల వరకూ పెట్టుబడి పెట్టాను. నల్లి తెగులు సోకి పూత అంతా రాలిపోతోంది. ఎన్ని పురుగు మందులు చల్లినా ప్రయోజనం లేకుండాపోతోంది. గతేడాదీ ఇదే విధంగా నష్టపోయాం. ఈసారి అదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సాయం అందించాలి.
                                     -పామర్తి శ్రీనివాసరావు, వలసపల్లి, ముసునూరు మండలం

                                                        పంట దున్నేయడం తప్ప వేరే గత్యంతరం లేదు

70 సెంట్లు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తున్నాను. నల్లి తెగులుతోపాటు, బొబ్బర తెగులు సైతం సోకడంతో పంటంతా దెబ్బతింది. దున్నేయడం తప్ప వేరే గత్యంతరం కనిపించడం లేదు. ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలి.
                                                                       -యలమందల బాపనయ్య, శోభనాపురం, నూజివీడు మండలం

                                                            ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలి

మిర్చి సాగును దెబ్బతీస్తున్న నల్లి తెగులును రాష్ట్ర విపత్తుగా గుర్తించాలి. పంట నష్టపోయిన వారికి ఎకరానికీ రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. సాగు చేస్తున్న కౌలు రైతుల పేర్లను ఇ-క్రాప్‌లో నమోదు చేయాలి. వారికే నష్టపరిహారం అందించాలి. నూజివీడు సబ్‌డివిజన్‌ పరిధిలో ఉద్యాన శాఖాధికారిని నియమించి రైతులకు అందుబాటులో ఉండేలా చేయాలి.
                                                           -నిమ్మగడ్డ నరసింహ, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు