రాయాలనే అనుకున్నా
కానీ ఆమె మీద పాకిన చేతులు చూసి
నా వేళ్ళు ముడుచుకుపోయాయి ...
ఒక్క కవితలో ఐనా
ఆమె కన్నీళ్లను నావిగా చేసుకుని
ప్రవహిద్దామనుకున్నా
నన్నెక్కడ ఊరేగిస్తారోనని భయపడిపోయా...
చదువంటే భయాన్ని నేర్పించే ఆయుధమైనప్పుడు
చదువంటే సంస్కారాన్ని మాయం చేసే శాసనమైనప్పుడు
చదువుకు చెదలు పట్టి చాలారోజులైనప్పుడు
ఒక రాత, ఒక గీత
ఎవరిని మార్చుతుంది?
ఇంకెవరిని ఉద్ధరిస్తుంది?
పుస్తకాల్లో చదువుకున్న
హిట్లర్లు ప్రాణం పోసుకుని
ఉరుకుతూ వచ్చినట్టుంది
ఎర్రకోట సాక్షిగా ఇప్పుడు నా మణిపూర్ శకటం
బట్టలిప్పుకుని ఊరేగుతోంది...
ఇక్కడ ప్రశ్నించడం నిషేధం
ఎందుకంటే మాటలొచ్చిన ఆయుధాల ముందు
నా దుస్తులు కూడా ముడుచుకుని
రాలిపోవాల్సిందే !
shame is a small word
no meaning in this world
shame became rapped
shame became paraded
వెనకటి తరాలు నాటిన
కుల విత్తులు మతం మత్తులు
ఇప్పుడిప్పుడే అగ్నిపర్వతాల్ని విరబూస్తున్నాయి...
ఆమె ఆత్మాభిమానాన్ని కాపాడలేకపోయిన
దేశప్రజలంతా
సోషల్ మీడియాలో జెండాను
కప్పి కాపాడామని
మా జడలను, మీసాలను ముడేసి మరీ విర్రవీగాం
ఓ మణిపూర్ మహిళా,
నీకు ఎన్ని కన్నీళ్లతో కళ్ళు కడిగినా తక్కువే ..
ఎందుకంటే, దేశాన్ని కాపాడే సైనిక కవాతు చూసాను
హిట్లర్ల చేతిలో దేశాన్ని ప్రశ్నిస్తూ
సిగ్గు విడిచిన నీ కవాతును చూసాను
నువ్వు నిజంగా ఒక నగ్న సైనికురాలివి
ఎంతోమంది స్త్రీలను మేల్కొలిపిన
సాధారణ కుకీ మణిపూర్ మహిళవి
నీకు నా జోహార్లు...
- అమూల్యచందు










