తనతో
పరిచయం నిన్న మొన్నటిది కాదు
కొంగుముడి నాటినుంచే
ప్రతి అడుగూ ప్రేమపాదుల దారై సాగుతున్న
అందమైన జీవన ప్రయాణం!
తనకిచ్చిందేమీ లేదుగానీ
ఆదిలోనే చదువుకు అడ్డుపడ్డ వైకల్యానికి
కొత్త అడుగులు నేర్పి ఊతమయ్యాను
పట్టుసడలని నమ్మకానికి ప్రాణంపోశాను
తనకు చేసిందేమీ లేదుగానీ
పేదరికం ఆంక్షల అడ్డుగోడలైన ప్రతిసారీ
ఆమె ముందు ఆత్మ విశ్వాసమై నిలబడ్డాను
అన్ని వేళలా భరోసా వాక్యమై వెంట నడిచాను
కన్నవాళ్ళని పోగొట్టుకుని
పుట్టెడు ద్ణుఖంలో ఉంటే
కంటి చెమ్మ తుడిచి
కలిసి జీవితం పంచుకుందామనే
ధైర్య వచనమయ్యాను గానీ
తనకు తానుగా నన్నేమీ అడగలేదు
ఒద్దికైన జంటను చూసి
కాలానికి కన్ను కుట్టిందేమో
ఇద్దరికీ శాశ్వతమైన వైకల్యాన్ని అంటగట్టి
జీవితానికి సరిపడా విషాదాన్ని మిగిల్చింది
అయినా...కాలానికేం తెలుసు?
ప్రేమతో కట్టుకట్టి ఆత్మ స్థైర్యపు లేపనం పూసీ
ఇలా స్ఫూర్తి వాక్యాలమై నిలబెడతామని
తెలిసుంటే ఇంతటి గాయం చేసేది కాదేమో?
ఎన్ని గాయాలనైనా భరిస్తూ
తాను నిలబడుతూ నన్ను నిలబెడుతూ
బిడ్డల పలకలపై అక్షరాల్ని కలగంటూ
ఇంటినొక నిబ్బరవేడుకని చేసే తను..
నాతో తోడుగా నడుస్తున్న వాక్యం !
- ఆది ఆంధ్ర తిప్పేస్వామి
77802 63877










