
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎస్‌సి విద్యార్థుల కోసం ప్రస్తుతం ఉన్న నీట్, జెఇఇ శిక్షణ కేంద్రాలకు అదనంగా మరో శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో బిఆర్ అంబేద్కర్ ఎస్‌సి గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్‌సి బాలురు కోసం గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు, కర్నూలు జిల్లా చిన్నటేకూరులో, బాలికల కోసం కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నీట్, జెఇఇ శిక్షణ కేంద్రాలు వున్నాయని తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాలకు వున్న డిమాండ్‌ను దృష్టిలో వుంచుకుని బాలికల కోసం మరో శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఎస్‌సి గురుకులాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్ర సగటును మించి ఫలితాలు సాధించాయని తెలిపారు. పదో తరగతిలో 80.38 శాతం, ఇంటర్‌లో 74.13 శాతం ఫలితాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలో గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఐదో తరగతిలో 14,940 సీట్లు వుండగా, వీటిలో తొలి విడత 13,881 మందిని ఎంపిక చేశామన్నారు. జూనియర్ ఇంటర్‌లో 13,520 సీట్లు ఉండగా, వీటిలో 13,180 సీట్లకు తొలి విడతలోనే విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. గురుకులాల్లో ఒక్కసీటు కూడా ఖాళీగా మిగిలిపోకుండా చూసుకోవాలని కోరారు. గురుకులాల్లో అన్ని స్థాయిల్లో బదిలీ ప్రక్రియను ఈ విద్యాసంవత్సరం మొదలయ్యేలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్స్ మాత్రం ఎక్కడ పోస్టింగు ఇస్తే అక్కడకు వెళ్లి విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ జయలక్ష్మి, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ పావనమూర్తి, సంయుక్త కార్యదర్శి శివరావు, ఎఎంఒ ఎన్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.