Jun 06,2023 20:39

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో '' ఇంటిగ్రేటెడ్‌ ఎక్స్‌ పోర్ట్‌ పార్క్‌''ను త్వరలో ఏర్పాటు చేయడం .జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. పురుగుమందుల అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకి ఉందన్నారు, విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో వ్యవసాయం, ఉద్యానవనం ప్రాసెస్‌ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు రైతులు, ఎగుమతి దారులతో మంగళవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయ ఆధారితరాష్ట్రమని, రాష్ట్రం నుంచి దేశంలోనే అధిక స్ధాయిలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయని వీటిని మరింత ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువ ధర వ్యవసాయ ఉత్పత్తులకు ఇచ్చేందుకు ఎగుమతిదారులు ముందుకు రావాలన్నారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నకు అధిక లబ్ధి చేకూర్చాలని నిరంతరం తపన పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, రైతు భరోసా, యంత్రసేవా పథకం, ఆర్‌భికెల ఏర్పాటు ఇలా విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు అండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ నిలుస్తుందన్నారు. అందులో భాగంగానే మార్కెట్‌ యార్డులను బలోపేతం చేయడానికి చయర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రైతులకు ఎగుమతి దారులకు మధ్య ఫ్రభుత్వం సమన్వయ కర్తగా పనిచేస్తోందన్నారు. వ్యవసాయశాఖ స్పెషల్‌ క మిషనరు హరికిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుసేవలో 10778 రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయని, విత్తు నుంచి విక్రయం వరకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి సీడ్స్‌ ఎండి శేఖర్‌బాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.