Jun 11,2023 07:38

గోలు బొమ్మలు తయారు చేయడం అంటే ... కదలకుండా గంటల తరబడి కూర్చోవాలి. అందుకు ఎముకలు, శరీరం ఎంతో సపోర్టు ఉండాలి. కాని కోయంబత్తూరుకు చెందిన రాధిక చిన్నతనం నుంచి ఎముకల వ్యాధితో బాధపడుతోంది. వరసగా శస్త్రచికిత్సలు చేయించుకుంది. మంచం మీద ఉండే పట్టుదలగా చదువుకుంది. సరదాగా డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, పెయింటింగ్‌ నేర్చుకొని, ప్రావీణ్యం సాధించింది. ఆ అలవాటే ఇప్పుడు ఆమెకు జీవనోపాధి అయింది. న్యూస్‌పేపర్‌తో రకరకాల బొమ్మలు తయారు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రతికూల పరిస్థితుల నుంచి తన జీవితాన్ని ఎలా మలుచుకుందో తన మాటల్లోనే విందాం.

My-dolls-see-a-world-I-dont-see



          ''నాకు ఊహ తెలిసినప్పటికే నేను రోజంతా మంచంలో కూర్చునేదాన్ని. ఇంటి పక్కన పిల్లలతో కలిసి ఆడుకోవాలని అనిపించేది. కానీ, శరీరం సహకరించేది కాదు. తోటి పిల్లలు ఉదయం పాఠశాలకు, సాయంత్రం ట్యూషన్‌కు వెళతారు. నేను వాళ్లను చూస్తూ ఉండేదానిని. ఎప్పుడైనా నేను మంచంలో నుంచి లేచేది- ఆసుపత్రికి వెళ్లేటప్పుడు మాత్రమే! బాల్యం నాకు చాలా కష్టంగా గడిచింది. అందరి పిల్లల్లా నేను ఉండేదాన్ని కాదు. జన్యుపరమైన వ్యాధితో బాధపడ్డాను.
 

                                                                          కళల వైపు దృష్టి

నన్ను నడిపించాలన్న కోరికతో నాన్న చాలా కష్టపడేవారు. అప్పట్లో ఒక్కో సర్జరీకి రూ. 35 వేలు అయ్యేది. అది అప్పట్లో నాన్నకు ఒక సంవత్సర జీతం. ఆయన టెక్స్‌టైల్‌ మిల్లులో సూపర్‌వైజర్‌గా పనిచేసేవారు. నా రెండు కాళ్లల్లో ఎముకలకు నాలుగు మెటల్‌ ప్లేట్లు స్క్రూలతో అమర్చారు. దాంతో కర్ర సహాయంతో నడవగలిగేదానిని. ఒక్కోసారి నా పరిస్థితి చూసి నాకే జాలి వేసేది. భవిష్యత్తులో ఏం చేయలేనేమో అనుకునేదాన్ని. ఎలాగోలా ఇంటర్‌ పూర్తి చేశా. తర్వాత డ్రాయింగ్‌, పెయింటింగ్‌పై దృష్టి పెట్టా. ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక నేర్చుకునేందుకు వెళ్లా. అవే ఇంత గుర్తింపు తీసుకొస్తాయని తెలియదు. న్యూస్‌ పేపర్లతో బొమ్మలు చేయడం చూపించారు. నేను ఇంటికి వచ్చాక వాటికి రంగులు వేసేదాన్ని. ప్లెయిన్‌ ప్లేట్లపై పువ్వులు, బొమ్మలు పెయింటింగ్‌ చేసేదాన్ని. వాటిని చూసి అమ్మ చాలా బాగున్నాయంటూ మెచ్చుకునేది. మెటీరియల్‌ తీసుకొచ్చి ఇచ్చేది. అలా అమ్మనాన్న నా వెన్నుతట్టారు. దాంతో కూర్చీలో గంటల కొద్ది కూర్చోవడం ఇష్టం లేక ఏకాగ్రతగా బొమ్మలు చేసి వాటికి రంగులు వేసేదాన్ని. నేను నడవలేను అన్న బాధను మరిచిపోయేలా చేసింది ఈ బొమ్మలే.
 

                                                                                సృజనాత్మకంగా ...

పాత వార్తా పత్రికలను కొనుగోలు చేసి, వాటిని కర్రపుల్లలుగా చుట్టి మొదట బొమ్మ చేయాలి. ఆ తర్వాత వాటికి పేపర్‌తో వస్త్రాలు వేసి, అభరణాలు వేశా. వాటికి రకరకాల రంగులు పూశా. ఎండలో పెట్టా. ఎంతో ఆకర్షణీయంగా, అందంగా ఉన్నాయంటూ నా స్నేహితులు, ఇంట్లో వారు మెచ్చుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు, వ్యంగ్య చిత్రాల నుండి సితార్‌, ట్రంపెట్‌ ఢోలక్‌లను మోస్తున్న సంగీతకారుల బృందాలు, పెళ్లి బృందాల బొమ్మలు, నృత్యకారులు, సంగీత విద్వాంసులు, కృష్ణుడు, గణేశుడు... ఇలా చాలా చేశా. పండగ సందర్భాల్లోనూ ఈ రకమైన బొమ్మలు చేసి ఇవ్వమని అందరూ అడిగేవారు. నా తమ్ముడు వాటిని అమ్మేవాడు. బయట నుంచి ఆర్డర్లు కూడా వచ్చేవి.
            అప్పుడే నాకు కొత్త ఆలోచన వచ్చింది. నా స్టైల్లో వైద్య నిపుణులు తెల్లటి కోటు, స్టెతస్కోప్‌ వేసుకున్న బొమ్మలు చేశా. లాయర్లు, పోలీసులు, కూలి పనులు చేసుకునే వ్యక్తులు, యూనిఫామ్‌ వేసుకున్న స్కూలు పిల్లలు ... ఇలా కొత్తగా ప్రయత్నించా. దాంతో మరింత గుర్తింపు వచ్చింది. కొనుగోలుదార్లు పెరిగారు. నేను చేసిన బొమ్మలను వారి ఇళ్లలో పెట్టుకుని మురిసిపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బొమ్మలు చూసి బట్టల తయారీదారులు వచ్చారు. వస్త్రాలు మీదబొమ్మలు చేయమన్నారు. ఒక్కో బొమ్మ రెండు, మూడు రోజులు పట్టింది. అలా వ్యాపారరంగంలోనూ అడుగుపెట్టా. అలా తనుష్కు బంగారం ఆభరణాల బొమ్మలూ చేయమన్నారు. చేసి ఇచ్చా. ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగిలి నష్టపోయా. అయినా బాధపడకుండా బొమ్మలు రూపొందిస్తున్నా. నెలకు రూ.15 వేలు వరకు ఆదాయం కనిపించింది. 2018 నుంచి 2,650 కంటే ఎక్కువ బొమ్మలు చేశా.

My-dolls-see-a-world-I-dont-see


                                                                                 ఎన్నో ప్రశంసలు

నా కళాత్మకమైన బొమ్మలను చూసి ఎందరో మెచ్చుకున్నారు. అవార్డులూ ఇచ్చారు. నా జీవితం గురించి తెలుసుకుని నన్ను ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రతిభ ప్రశంసా పత్రాన్ని అందుకున్నా. నేను నేర్చుకున్న ఈ విద్యను స్కూలు పిల్లలకు నేర్పిస్తున్నా. వారి సహాయంతో పెయింటింగ్‌, బొమ్మల తయారీ రంగంలోనూ రాణిస్తున్నా. వాటిని విదేశాలకు పంపిస్తున్నా... నేను వెళ్లలేకపోయినా నా బొమ్మలు ప్రపంచాన్ని చూస్తున్నాయంటే నా ఆనందం మాటల్లో చెప్పలేను.''

                                                                          ఏడు శస్త్ర చికిత్సలైనా..

ఐదేళ్ల వయసులో కుడి కాలికి శస్త్రచికిత్స చేయాలన్నారు వైద్యులు. తర్వాత మూడు నెలలు బెడ్‌ రెస్ట్‌. తొమ్మిది నెలల్లో అదే కాలుకు మరొక శస్త్రచికిత్స. ఆపై, ఒక సంవత్సరం మంచంలోనే. పెద్దయ్యేకొద్దీ నాకు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకున్నా. దాని పేరు ఆస్టియోజెనిసిస్‌ ఇంపెర్ఫెక్టా. పెళుసు ఎముక వ్యాధి. ఇది జన్యుపరంగా లేదా వంశపారంపర్యంగానైనా రావొచ్చుట. దీనివల్ల ఎముకలు సులభంగా విరిగిపోతాయి. చిన్న గాయమైనా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 12 సంవత్సరాల వయస్సుకే ఏడు శస్త్ర చికిత్సలు జరిగాయి నాకు.
           ఒకసారి ఆపరేషన్‌ కోసం థియేటర్‌ లోపలికి వెళ్లేటప్పుడు మా నాన్నతో 'నొప్పి భరించలేను నాన్నా... నన్ను చంపేయండి' అంటూ ఏడ్చా. ఆ వయస్సులో ఆపరేషన్లతో, ఎముకల నొప్పులతో నీరసంగా ఉండేది. రెండు కాళ్లూ కదిలేవి కావు. వీల్‌ఛైర్‌లోనే బాల్యం గడిపా. తోటి పిల్లల్ని చూస్తున్నప్పుడు చదువుకోవాలన్న పట్టుదల ఉండేది. చదువుపై నా ఆసక్తి గమనించి, అమ్మనాన్న స్కూలుకు పంపారు. కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు, కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు శరీరంలో చురుకుదనం లేకపోయినా మనసు మాత్రం ఉత్సాహంగా అనిపించేది.