మేడే మసులుతున్న రక్తపు టేరుల
కార్మిక, కర్షక చెమట చుక్కల స్వేదాగ్ని సంధ్యా సమరం
ఇది నాటికి, నేటికీ ఆకలి ఆత్మల
హారతి కర్పూరం
ఆశావహుల అమృత భాండాగారం
మృతవీరుల త్యాగఫలం మహాజనుల కన్నీటి జలం
కణకణానా కెలుకుతుంది.....
నుదుటున సిందూరమై..!
మేడేకు కులం లేదు, కుట్ర లేదు
మతం లేదు వర్గం లేదు
మానవతే హితం జగత్ అని
శ్వాసను ఊదిన శాసనం..!
భూమి, భుక్తి, విముక్తి పోరాటాలకు
పురుడు పోసిన పున్నమి జాబిలి
దోపిడీ దొంగల, బూర్జువా వ్యవస్థను
పెకిలించిన ప్రగతి రథ చక్రం..!
మేడే శ్రమ సౌందర్యం
సకల జనుల ఔదార్యం
కలతలేని నడక
కందిపోని మరక..!
అందుకే నువ్వంటే
పిల్లా పెద్దలు కేరింతలు పెడుతూ
కాగాడాలతో విప్లవాన్ని నినదిస్తున్నారు.. విశ్వవ్యాపితంగా.!
వర్ధిల్లాలి.. వర్ధిల్లాలి..!
- ఎల్. ఉపేందర్
99494 92677










