
హిందూ దేవాలయాల్లో ముస్లింలు, మసీదుల్లో హిందువులు సేవలు చేయడం గురించి చాలా సార్లు విన్నాం. ఆలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడం, మొక్కలకు నీళ్లు పోయడం, ప్రసాదాలు చేసి ఇవ్వడం, పండుగలప్పుడు భోజనాలు సమకూర్చడం.. ఇలా ఒకటేమిటి ఎన్నో పనుల్లో హిందూ, ముస్లింలు ఐక్యమత్యంగా మెలగడం చూశాం. ఇప్పుడు చెప్పుకుంటున్నది కూడా అటువంటి విషయమే అయినా, ఇక్కడ ఒక విశేషం ఉంది. సాధారణంగా ఆలయ పూజా నిర్వహణలను నిర్వహించే అర్చకులుగా ముస్లిం వ్యక్తులు కనపడుతున్నారు. ఇలా ఒకటి, రెండు కాదు.. 150 ఏళ్ల నుండి చేస్తున్నారు. కర్నాటక గడగ్ జిల్లా కొరికొప్ప హనుమ ఆలయంలో ఈ దృశ్యం కనపడుతోంది. ప్రస్తుతం శ్రావణ మాసం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు అక్కడికి హాజరవుతున్నారు. పూజలు, హోమాలు, తదితర క్రతువులను హిందువులు, ముస్లింలు ఏకమై నిర్వహిస్తున్నారు.
ఇప్పుడు అక్కడ కొరికొప్ప గ్రామం ఒక్కటే కనపడుతోంది. కానీ ఒకప్పుడు కోనెరికొప్ప, కొండికొప్ప, కొరికొప్ప గ్రామాలు కలిసి ఉండేవి. గ్రామ పొలిమేర్లలో చిన్న హనుమ ఆలయం ఉండేది. ప్లేగు, కలరా వ్యాధులు ప్రబలి గ్రామస్తులంతా వలస వెళ్లిపోయారు. దీంతో కొరికొప్ప గ్రామం ఒక్కటే మిగిలివుంది. ఆ సమయంలో ఇక్కడి హనుమ ఆలయంలో పూజలు చేసేందుకు పుటగౌన్ బద్ని గ్రామం నుంచి వచ్చిన ముసములు ముందుకు వచ్చారు. వ్యాధులకు భయపడి గ్రామాలకు గ్రామాలు కదిలి వెళ్లిపోయినా ముస్లిం వ్యక్తులు పూజలు చేయడం గ్రామస్తులను ఆశ్చర్యపర్చింది. సాంప్రదాయం పోకుండా వారు చేసిన పనికి కృతజ్ఞతగా ఆ రోజు నుండి పూజా క్రతువులన్నీ ముస్లిం వ్యక్తులనే చేయమని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అది ఈ రోజు వరకు నిరాటంకంగా సాగుతోంది. ఇది కదా, మతసామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.