
క్రిస్మస్ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది మ్యూజిక్. ఆ తర్వాత అలంకరణ, నక్షత్రాలు, రకరకాల విద్యుత్ దీపాలు, శాంటాక్లాజ్ ఇలా.. చెప్పుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకూ జరుపుకునే పండుగ. చాలా ప్రదేశాల్లో కుల, మతాలకతీతంగా క్రిస్మస్‌ను జరుపుకుంటారు. ఇందులో భాగంగా డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. స్కూళ్లల్లో, చర్చిల్లో పిల్లలకు రకరకాల పాటలు, అలంకరణ పోటీలు నిర్వహిస్తారు. అయితే ఒక్కో దేశంలో ఈ పండుగను ఒక్కో విధంగా జరుకుంటారు. నేడు క్రిస్మస్ సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం...
ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే వేడుక క్రిస్మస్. ఏటా డిసెంబర్ 25న ఈ పండుగ చేసుకుంటారు. అనేక దేశాలు ఈ రోజున సెలవు ప్రకటించాయి. క్రైస్తవుల్లో అత్యధికులు మతపరంగానూ, క్రైస్తవేతరులు సాంస్కృతి పరంగానూ నిర్వహిస్తారు. పశ్చిమదేశాల్లో తీవ్రమైన మంచు పడే కారణంగా సెలవులు ప్రకటిస్తారు. ఈ సీజన్లో క్రిస్మస్ అత్యంత ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. చిమ్నీల దగ్గర కుటుంబ సభ్యులంతా కూర్చుని, వివిధ రకాల పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటారు. అలాగే ఈ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు అత్యంత ఇష్టమైన పండుగల్లో ఇదొకటి. క్రిస్మస్ రాత్రి శాంటాక్లాజ్ వచ్చి అందరికీ కావాల్సిన బహుమతులు ఇస్తాడని విశ్వసిస్తారు. దీంతోపాటు ఫాదర్ క్రిస్మస్, సెయింట్ నికొలస్, క్రైస్ట్ కైండ్ వంటి పాత్రలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. జానపద గాథలు పిల్లలకు చెప్పడం క్రిస్మస్ సంస్కృతిలో భాగమయ్యాయి. మనదేశంలో అయితే చాలా ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ఇళ్లముందు క్రిస్మస్ చెట్టు పెట్టి, దానికి స్టార్‌ను వేలాడదీస్తారు. అంతే కాకుండా ఆ చెట్టుపక్కనే పాక వేసి, అందులో క్రీస్తు జననానికి సంబంధించిన ప్రతిమలను అలంకరిస్తారు.

- క్రిస్మస్ ట్రీ ..
క్రిస్మస్ పండుగ రోజు ఫర్ చెట్టును అలంకరించడం పదవ శతాబ్దం నుంచి ప్రారంభించారు. 1832లో ప్రొఫెసర్ చార్లెస్ ఫోలెన్ క్రిస్మస్ చెట్టును కొవ్వొత్తులు వెలిగించి, అలంకరించాడు. కాలక్రమంలో విద్యుత్ దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా మారింది. క్రిస్మస్ పండుగ కోసం ఏటా లక్షల సంఖ్యలో అమ్మకాల కోసం ఫర్ చెట్లను పెంచుతుంటారు.

- సామూహిక ప్రార్థనలు.. విందులు..
వివిధ దేశాల్లో క్రిస్మస్ సందర్భంగా ఎడ్వంట్ రెత్ పేరిట ఓ ఆకుపచ్చని ఆకులతో రింగ్ తయారుచేసి, కొవ్వొత్తులు వెలిగిస్తారు. క్రిస్మస్ సంగీతం, అందులో క్రిస్మస్ క్యారల్ అనే గీతాలాపన, క్రిస్టింగల్ అనే కొవ్వొత్తి వెలిగిం చడం, సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక విందులు కనిపిస్తుం టాయి. మరికిన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులు వెలిగించడం, మంటలు వెయ్యడం, పొయ్యిని వెలిగించడం ఒక ఆచారం. చలికాలంలో కొవ్వొత్తులు వెలిగించడం వల్ల ఇంటికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు, సంపదను తెస్తాయని నమ్ముతారు.
- సందడిగా షాపింగ్ మాల్స్...
అనేక దేశాల్లో క్రిస్మస్ పండుగ మొదలుకుని న్యూ ఇయర్ వరకూ వ్యాపారులకు ముఖ్యమైన సమయం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ. ఈ సీజన్‌లో గిఫ్టులు, గ్రీటింగ్ కార్డులు, మ్యూజిక్ ఇనుస్ట్రుమెంట్స్, లైటింగ్, కొత్తబట్టలు ఇలా ప్రతిదీ వ్యాపారమే. దీంతో ఈ పండుగ సందర్భంగా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. పండుగకు నెల రోజుల ముందు నుంచే అమ్మకాలు ప్రారంభమవుతాయి. షాపింగ్ మాల్స్ సందడి సందడిగా ఉంటాయి. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తారు. అయితే ఇందులో ముఖ్య భూమిక పోషించేవారు బేకరీల నిర్వాహకులు.. ఈ సీజన్‌లో కేకులకు మంచి గిరాకీ...రకరకాల ఫ్లేవర్లలో, డిజైన్లలో తయారుచేసి, కొనుగోలుదారులను ఆకర్షిస్తారు. ఇది ఇలా ఉంటే ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి పాటిస్తుంటారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతాయి..
- క్యారల్స్..
డిసెంబర్ మొదటి వారం నుంచే క్యారల్స్ గీతాలాపనతో క్రిస్మస్ ప్రారంభమవుతుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కోచోట ఒక్కోరకంగా వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో క్యాండిల్స్ వెలిగించుకొని, క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ... రోడ్ల వెంట ప్రదర్శన చేస్తారు. మరికొన్ని చోట్ల ముందుగానే చెప్పి, ఇళ్లకి వెళ్తారు. ఆ బృందాన్ని వారు ఆనందంగా ఆహ్వానించి, చక్కటి ఆతిథ్యం ఇస్తారు. క్యారల్ బృందం క్రిస్మస్ గీతాలతో బాలఏసును ఆరాధిస్తారు. ఇంకొన్నిచోట్ల... శాంటాక్లాజ్‌తో సహా క్యారల్ బృందం గీతాలాపన చేస్తూ ఇంటింటికీ వెళతారు. ఇదంతా క్రిస్మస్ రోజున ప్రజలంతా ఒకచోటు చేరేందుకే అని చెబుతుంటారు.

- ఫ్రాన్స్‌లో..
ఇక్కడ క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 6న సెయింట్ నికోలస్ రోజుతో ప్రారంభమవుతాయి. పిల్లలు స్వీట్లు, చిన్నచిన్న బహుమతులు పొందుతారు. అల్సాస్ ప్రాంతంలో అలంకరించిన క్రిస్మస్ చెట్లను పెట్టే సంప్రదాయం 14వ శతాబ్దం నాటిది. పిల్లలు పాలిష్ చేసిన తమ షూలను చిమ్నీ ముందుంచడం ఓ ఆనవాయితీ.
- జర్మనీ, ఇటలీలో..
సాధారణంగా పశువుల పాకలో గడ్డితో నిండిన తొట్టితో వున్న క్రీస్తు జననం దృశ్యాన్ని చర్చిలు, పట్టణ కూడళ్లు, ఇళ్లలో ఉంచుతారు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలలో ఇది సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. వాస్తవానికి ఇది ఇటలీ నుంచే ప్రపంచమంతా వ్యాపించింది. జర్మనీలో క్రిస్మస్‌కు ముందు నుంచే నగరాల్లోని ప్రధాన కూడళ్లలో పండుగ మార్కెట్‌లు ఏర్పాటు చేస్తారు.
- ఇంగ్లాండ్‌లో..
ఇక్కడ నవంబర్ మధ్య నుంచే అలంకరణలను ప్రారంభిస్తారు. ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఇంటి యజమానులు స్థానిక స్వచ్ఛంద సంస్థలకు సహాయంగా వారి ప్రదర్శనలకు సందర్శకుల నుండి విరాళాలను సేకరిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
- పోర్చుగల్, ఐస్‌లాండ్‌లో..
డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్‌తో ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి, విందును ఆస్వాదిస్తారు. పిల్లలు తమ బూట్లను కిటికీపై ఉంచుతారు. 'జులేటైడ్ లాడ్స్', శాంటాక్లాజ్, బూట్లను చిన్న చిన్న వస్తువులతో నింపుతారు. పోర్చుగల్ పట్టణాలు, గ్రామాల్లో, కమ్యూనిటీ చర్చి కార్ పార్క్‌లో వెలిగించిన మంటల చుట్టూ గుమిగూడి, ఒకరికొకరు 'ఫెలిజ్ నాటల్' శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
- ఫిలిప్పీన్స్‌లో..
క్రిస్మస్ లాంతరును కలిగి ఉండే ప్రత్యేక సంప్రదాయం ఉంది. దీనిని 'పరోల్' అని పిలుస్తారు. నక్షత్రాకారంలో వుండే ఈ లాంతరు బెత్లెహెం నక్షత్రాన్ని గుర్తుచేస్తుంది. ప్రధానంగా వెదురు, కాగితంతో తయారుచేస్తారు. అందుకే ఇక్కడి
మార్కెట్లలో క్రిస్మస్ లాంతర్‌లను విక్రయిస్తుంటారు.
- ఆస్ట్రేలియాలో..
చర్చిలు నిర్వహించే పిక్నిక్‌లలో పాల్గొనడం, బీచ్‌లో క్రిస్మస్ పాటలు పాడడం.. క్రిస్మస్ దినాల్లో ఇక్కడి సంప్రదాయం. ఆస్ట్రేలియా దక్షిణ అర్ధగోళంలో ఉన్నందున, పండుగ సీజన్ వేసవి కాలంలో ఉంటుంది. క్రిస్మస్ సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు తరచుగా బీచ్‌లో సమావేశమవుతారు.
- బ్రెజిల్‌లో..
'పాపాయి నోయెల్', ఫాదర్ క్రిస్మస్, బ్రెజిలియన్ పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి గ్రీన్‌ల్యాండ్ నుండి బ్రెజిల్‌కు వెళతాడు. రియో డి జెనీరోలోని తేలియాడే క్రిస్మస్ చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్మస్ చెట్టుగా గుర్తింపు పొందుతోంది. 'మేరీ క్రిస్మస్!' అని రాసిన క్రిస్మస్‌కార్డులు పంపడం, ఇవ్వడం ఆనవాయితీ.
క్రిస్మస్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ పద్ధతిలో జరుపుకున్నప్పటికీ... శాంతియుత జీవనం, ఒకరితో ఒకరు సమాధానం కలిగి వుండాలని బోధించడం ఈ పండుగ ప్రజలకు అందించే సందేశం.
ఉదయమిత్ర