Jul 27,2023 16:49
  • NH-65 జాతీయ రహదారిపై వరద నీరు.. 

​​​​​​ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్‌) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి.   వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వాహనాలు బారులుతీరాయి. కొందరు వాహనదారులు వరదనీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మునేరుకు వరద రావడంతో ఆయకట్టు పరిధిలోని సుమారు పదహారువేలు హెక్టార్లకు పైగా మెట్ట మాగాని అపరాల పంటలు పూర్తిగా నీట మునిగాయి. జాతీయ రహదారిపై వరద ఉదృతి పెరగడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షిస్తున్నారు. 2004 సంవత్సరంలో ఇదే రహదారిపై మున్నేరు వరద పొంగి ప్రవహించింది. 2005 మరియు 2009 సంవత్సరం కాలంలో కూడా జాతీయ రహదారిపై వరద ఉదృతంగా ప్రవహించింది. అప్పట్లో అర కిలోమీటర్‌ వరకు జాతీయ రహదారి పూర్తిగా కోసుకుపోయిన విషయం తెలిసిందే.

2

 

3