Jul 20,2023 06:55

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుండటంతోపాటుగా ఫింగర్‌ పెయింటర్‌గా అద్ఛుత కళాఖండాలకు జీవం పోస్తున్నారు ఆత్మకూరు రామకృష్ణ. మరో వైపు కవిత్వం రాస్తూ సాహిత్య ప్రస్థానంలో తనవంతుగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే పలు సంకలనాలను సైతం ప్రచురించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారాయన. చిన్ననాటి నుంచే బొమ్మలు గీయటాన్ని అలవర్చుకున్నారు. ఊరి చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని మెచ్చి తన కుంచెతో చిత్రలేఖనం ప్రారంభించారు. మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ను పూర్తిచేశారు. చిన్ననాటి నుంచి నేటికీ ఎన్నో అద్భుత కళాఖండాలు తీర్చిదిద్దారు. ఎన్నో అవార్డులు రికార్డులు అందుకున్నారు.

2


విజయవాడ కేంద్రీయ విద్యాలయం-2లో ఆర్టు టీచరుగా పనిచేస్తున్న ఆత్మకూరు రామకష్ణ 11 సంవత్సరాల క్రితం బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌ను నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కుంచె వంటి ఉపకరణాలు లేకుండా కేవలం చేతివేళ్ళతో ఆయిల్‌ కలర్స్‌ని ఫింగర్‌ పెయింటింగ్స్‌గా వాడి 12 ఇంటూ16 ఇంచెస్‌ స్ట్రెచ్డ్‌ క్యాన్‌వాసుపై 13:26 గంట (806 నిమిషాలు)ల్లో 100 చిత్రాలను గీసి ప్రపంచ రికార్డును అందుకున్నారు. కరోనా కష్టకాలం నేర్పిన పాఠాలతో యూట్యూబర్‌గా మారిన రామకృష్ణ ఓ చిత్రకారునిగా గతంలో తాను చిత్రించిన వందల చిత్రాలను వీడియోలుగా మలచి యూట్యూబు వేదికపై 14 వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలిచ్చారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీన మొదటి ఎపిసోడ్‌తో వీడియోలు ప్రారంభించి రోజుకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. 100వ ఎపిసోడ్‌ ఏప్రిల్‌ 10తో ముగిసి మరో ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఫర్‌ ఫార్మర్‌, ఎడిటర్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌గా కూడా రామకృష్ణే వ్యవహరించి వీడియోను రూపొందించటం మరో విశేషం. ప్రతిరోజు ఒకే టైమ్‌కి 'ఆత్మకూరు రామకృష్ణ ఆర్టిస్ట్‌' అన్న స్వీయ యూట్యూబ్‌ ఛానల్లో ధారావాహికగా ప్రసారం అయ్యేట్లు ఏర్పాటు చేశారు. విజువల్‌ ఆర్టు (దశ్య కళ)ల్లో ఒకటైనా చిత్ర లేఖనాన్ని నాలుగు గోడల మధ్య కాక ఫర్‌ఫామింగ్‌ ఆర్టు (ప్రదర్శన కళ)గా మార్చి పేక్షకుల ముందు ప్రదర్శించటమేకాక, దానికి కొన సాగింపుగా మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ఫింగర్‌ పెయింటింగును మరింత ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు.

4

కళకు, కళారూపానికి ఖర్చు లేని ప్రచార వేదిక యూట్యూబ్‌ కాగా, ఆ వేదికతో పంచుకున్న వరల్డ్‌ రికార్డు ఫీట్‌కు శాశ్వతత్వం లభించింది. భవిష్యత్‌ తరాలకు ఈ వరల్డ్‌ రికార్డు విశేషాలను అందుబాటులో ఉంచటం, మరికొందరికి ఆదర్శంగా ఇవ్వటమే కాకుండా యూట్యూబ్‌ ద్వారా ఓ గొప్ప సాంస్క ృతిక సంపదను భావితరాలకు అందించే కృషిని కొనసాగిస్తున్నారు.

3
  • 13 గంటలపాటు ఏకధాటిగా ...

13.26 గంటలపాటు కూర్చొన్న చోటనే కూర్చుని 'ఆత్మకూరు స్వీయ మోనోగ్రాఫ్‌' అనే అపురూప ప్రక్రియను చేపట్టారు. తన విజయగాథను ఫింగర్‌ పెయింటింగ్‌ మారథాన్‌'గా మలచారు. సాధారణంగా చిత్రకారుడు తన శైలి, మెటీరియల్‌ను గానీ పరిచయం చేసేందుకే అర్ధగంట నుంచి గంట సమయం పడుతుంది. ఆ గంట, అర్ధగంట సమయంలోనే రమారమి 5 నుండి 8 చిత్రాలను భిన్నంగా ఉండేలా చిత్రించి చూపడం రామకృష్ణ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక చిత్రకారుడి జీవితకాలపు కృషినీ, సాఫల్యాన్ని రికార్డు చేయగల మోనోగ్రాఫ్‌ను ఏదైనా ఒకదాన్ని తీసుకుని పరిశీలించినట్లయితే... రైటప్‌తో కలుపుకుని మహా అయితే 50, 60 పుటలు మించదు. పోనీ 100 పుటలనుకుందాం. రామకృష్ణ 2010 మే 20న ప్రదర్శించిన 13 గంటల 26 నిమిషాల అపురూప ఘట్టాన్ని సుమారు 472 పుటల మోనోగ్రాఫ్‌గా సంతరించారు. 100 చిత్రాలను రచించిన 13:26 గంటల కృషి ఒక ఎత్తయితే, ఆ కృషిని పొందుపరచిన ఈ గ్రంథం అంతకు మించిన కృషి.

3


''నేను నా చేతుల్ని నమ్ముకున్నాను. అవి నన్ను నిలబెట్టాయి'' అని గర్వంగా చెబుతున్నారు ఆత్మకూరు రామకృష్ణ. పలువురు ఆయనను 'మునివేళ్ళ మాయావి', 'కళాకృష్ణుడు'', 'చేతికి బాగా పట్టిన రంగు', అంటూ పలువురు అభినందిస్తున్నారు. ఆత్మకూరు రామకృష్ణ తన మోనోగ్రాఫ్‌కు తానే రచయితగా మారి రాయటం, ఇందులో వినియోగించబడ్డ అన్ని తైలవర్ణ చిత్రాలు ఒక్క రోజులోనే (806 ని.లలో) వేయడంతో- 'ఫాస్టెస్టు పెయింటర్‌'గా రికార్డు నెలకొల్పారు.

- యడవల్లి శ్రీనివాసరావు