Jun 18,2022 10:45

అనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున విమర్శించారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి మూడవరోజు అనంతపురంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద పనిముట్లను చేత పట్టుకొని కార్మికులతో కలిసి శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి.మల్లికార్జున మాట్లాడుతూ... ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని, వారిని రెగ్యులర్‌ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వారికి కనీస వేతనాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మున్సిపల్‌ కార్మికుల జీవితాలను రోడ్లపాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న లేక మొన్న వచ్చిన సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ వారికి 25 వేల రూపాయలు వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, మరి ఏళ్ల తరబడి పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులకో న్యాయం మున్సిపల్‌ కార్మికులకో న్యాయం అంటే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని, లేనిపక్షంలో కార్మికుల సమస్యల పరిష్కారానికై అవసరమైతే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమ్మె సమయంలో పారిశుధ్య లోపంతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు ప్రభుత్వం, మున్సిపల్‌ అధికారులే నైతిక బాధ్యత వహించాలని బి.మల్లికార్జున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు రాము, మల్లేష్‌, ఆదిలక్ష్మి, వన్నురమ్మ, వన్నూరు స్వామి, సిద్ధలింగ, ఎర్రి స్వామి, అల్లాబాకష్‌, బసవరాజు, వెంకటేశులు, కార్మికులు పాల్గొన్నారు.