Sep 16,2023 10:42

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర ఉద్యమ నేత, ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు, సైద్ధాంతికవేత్త, సిఐటియు మాజీ జాతీయ కార్యదర్శి కనయ్ బెనర్జీ మృతికి సిఐటియు, ఎఐకెఎస్‌ తదితర సంఘాలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. 1939లో ఢాకాలో సుభాష్‌ చంద్రబోస్‌ ప్రసంగించిన సమావేశానికి హాజరైన విషయాన్ని బెనర్జీ గుర్తు చేసుకునేవారని తెలిపాయి. ప్రజా ఉద్యమాల్లోనూ, రాజకీయ కార్యకలాపాల్లోనూ క్రియాశీలంగా పాల్గొంటున్నందుకు ఆయనను ఇంటి నుండి వెళ్లగొట్టారు. కూచ్‌బీహార్‌లోని కాలేజీ నుండి బహిష్కరించారు. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయన్ని మళ్లీ కళాశాలలోకి తీసుకున్నారు. 1940 తొలినాళ్లలో బీడీ కార్మికులు, టైలర్లు, రజక వృత్తిదారుల సంక్షేమం కోసం ఉద్యమాలు నిర్మించిన ఆయన తర్వాత సహకార సంస్థలను నడిపారు. కలకత్తాకు వచ్చిన తర్వాత విద్యార్ధి ఉద్యమంలో, కార్మిక సంఘ ఉద్యమంలో చాలా చురుగ్గా వుండేవారు. 1974లో చారిత్రక రైల్వే సమ్మెలో కీలక పాత్ర పోషించారు. 1984లో రైల్వే నుంచి ముందుగానే రిటైర్‌మెంట్‌ తీసుకుని బిటిఆర్‌ చొరవ మేరకు ఢిల్లీలో సిఐటియు సెంటర్‌లో కనరు చేరారని సిఐటియు గుర్తు చేసుకుంది. 1989 నుంచి సిఐటియులో వివిధ రంగాల్లో, వివిధ రాష్ట్రాల్లో పలు బాధ్యతలు నిర్వహించారు. సిఐటియు నాయకత్వంలోకి మహిళలను కూడా తీసుకురావాలని ఆయన పట్టుబట్టేవారు. సిఐటియు లైబ్రరీ రూపకల్పనలో ఆయనది కీలక పాత్ర అని గుర్తు చేసుకుంది. ఆయన మృతికి సంతాపసూచకంగా సిఐటియు, ఎఐకెఎస్‌ పతాకాలను అవనతం చేశారు. ఆయన మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆయా సంఘాలు సానుభూతిని ప్రకటించాయి.
            దార్శనికత కలిగిన కార్మిక సంఘ నేతగా ఆయన పలు రంగాల్లో పనిచేశారని, వర్కింగ్‌ ఉమెన్స్‌ ఉద్యమాన్ని అభివృద్ధిపరిచారని ఎఐకెఎస్‌ పేర్కొంది. రైతులు, కూలీల మధ్య ఐక్యత కోసం ఆయన కృషి చేశారని పేర్కొంది. దేశవ్యాప్తంగా కార్మిక సంఘ ఉద్యమాల నిర్వహణలోనూ, కార్మికులను, రైతులను సమైక్యపరుస్తూ ఆయన సాగించిన ఉద్యమం ఎన్నటికీ గుర్తుండిపోతుందని పేర్కొంది.