May 19,2023 08:18

ఓ ఊరిలో రాజమ్మ, రాజయ్య ఉన్నారు. వీరికి రంగడు ఒక్కడే కొడుకు. రంగడు చిన్నతనంలోనే తండ్రి రాజయ్య జబ్బుచేసి చనిపోయాడు. దాంతో రాజమ్మ కష్టపడి కొడుకును పెంచింది. ఉన్నంతలో ఏ లోటూ లేకుండా చేసేది. డబ్బు దాచి ఇల్లు కట్టింది. రంగడు పెద్దవాడయ్యాక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. కొన్నాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దతనం అయినా కూడా వారి కోసమని రాజమ్మ పనికి వెళ్లేది. కొన్నేళ్లకు రాజమ్మ బాగా వృద్ధురాలు అయ్యింది. పనికి వెళ్లలేని స్థితికి చేరింది. మంచంలోనే పడుకుంటూ కోడలు పెట్టింది తింటూ ఉండసాగింది.
          కొన్నాళ్లకు రంగడులో మార్పు రాసాగింది. పిల్లల్ని, భార్యను చూసినట్లుగా తల్లిని పలకరించేవాడు కాదు. పని చేయని తల్లికి తిండి పెట్టడం దండగ అనుకోసాగాడు. ఒక రోజు ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. ఆ మాటలు విన్న ఓ వ్యక్తి, ఊరి పంచాయతి సభ్యులకు తెలిపాడు. వారంతా రంగడును ఊరి అరుగు దగ్గరకు పిలిపించారు. పెంచి, పెద్ద చేసిన తల్లిని చూడని వాడిని- ఊరిలో పిల్లలూ చూసి అలాగే మారిపోతారని అనుకున్నారు. రంగడుకు ఇరవై కొరడా దెబ్బలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజమ్మ అరుగు దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. తన కొడుకును శిక్షించవొద్దు అని గ్రామాధికారిని ప్రాధేయపడింది. రాజమ్మ మనసు అర్థం చేసుకున్న రంగడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. కన్నతల్లిని గుండెలకు హత్తుకుని తాను అన్న మాటలకు క్షమించమని కోరాడు. దాంతో గ్రామాధికారి శిక్ష రద్దు చేశాడు.

katha
-ఎం మేఘన,
6వ తరగతి,
జిల్లా పరిషత్‌ హై స్కూలు,
తాడేపల్లి.