Oct 27,2023 08:43

వాళ్ళు యుద్ధోన్మాదంతో బాంబులు విసిరి ప్రాణాలు తీస్తున్నారు.
ఈ అమ్మలు కడుపులోని బిడ్డలకు ఎలా ప్రాణం పోయాలా అని తల్లడిల్లిపోతున్నారు.
ఇదీ, ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులతో గాజాలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితి
!

11

'నా చుట్టూ బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు, ఎటువైపు నుండి బుల్లెట్ల వర్షం కురుస్తుందో తెలియడం లేదు. ఆకాశం నుండి మా ప్రాణాలను హరించే మందుపాతరలు నేలరాలుతున్నాయి. ఇక్కడి వాతావరణం దట్టమైన పొగతో నిండిపోయింది. నా కళ్ల ముందే నా అనుకున్నవాళ్లను పోగొట్టుకున్నాను. ఎటుచూసినా శవాల దిబ్బలే. కుప్పకూలిన భవంతుల మధ్య అయినవాళ్ల మృతదేహాలను వెతుక్కుంటున్న భయానక దృశ్యాలు. పిల్లలు, వృద్ధులు, మహిళలు అన్న తేడా లేదు. వేలాదిమంది అతి దారుణంగా హతమయ్యారు. ఇంతటి భీకర పరిస్థితిలో నెలలు నిండిన నేను నా బిడ్డకు ఎలా జన్మ ఇవ్వాలి? ఒకవేళ ఆ బిడ్డ ఈ భూమ్మీదకు వస్తే.. తనని ఎలా కాపాడుకోవాలి' అంటూ గాజా భూభాగంలో గర్భిణీలు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. ఒకరు, ఇద్దరు కాదు; మొత్తం 50 వేల మంది ఇప్పుడు అక్కడ ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. వైద్యులు, వైద్య సదుపాయాలు మృగ్యమైన వేళ, దీనంగా రోదిస్తున్న ఆ మహిళలను ఆదుకునేవారు ఎవరు ?
            నివిన్‌ అల్‌ బార్బీ (33) ఈ నెలలోనే తన మొదటి బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అక్టోబరు 7న ఇజ్రాయిల్‌ మారణహోమం మొదలు కావడానికి ముందు రోజు వరకు ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. మధుమేహం, రక్తపోటు, గ్యాస్టిక్‌ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించేందుకు రోజూ డాక్టరును కలిసేది. కానీ ఇప్పుడు ఆమె ఆశ్రయం పొందుతున్న శిబిరం పక్కనే ఇజ్రాయిల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. 'ప్రతి విస్ఫోటనానికి నా శరీరం చిగురుటాకులా వణికిపోతోంది. భయంతో వెన్నుపూస కదిలిపోయినంత బాధ కలుగుతోంది. ఒత్తిడి వల్ల కడుపులో తీవ్రంగా నొప్పి వస్తోంది. ఏ ఇల్లు నేలమట్టమవుతుందో.. ఎవరు చనిపోతారో తెలియని భీకర వాతావరణంలో నా బిడ్డకు ఎలా జన్మ ఇవ్వాలి?' అని ఆమె తల బాదుకుంటూ రోదిస్తోంది.
            'ప్రతి రోజూ ఇక్కడితో ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాను. కానీ రోజురోజుకూ నా కళ్ల ముందే గాయాలపాలైన, బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో చిన్నారులు ఇక్కడి నేలపై బారులు తీరుతున్నారు' అంటోంది ఆరునెలల గర్భిణీ సౌద్‌ అస్రాఫ్‌. ఆమె షాతి శరణార్ధ శిబిరంలో ఆశ్రయం పొందుతోంది. తన మూడో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఆమె 'నేను ఇక్కడ చాలా ఒత్తిడితో ఉంటున్నాను. భయంతో నిద్ర పట్టడం లేదు. అరకొర సదుపాయాలతో అపరిశుభ్ర వాతావరణంలో నా ఇద్దరు బిడ్డలను కాపాడుకోవడమే ఇప్పుడు కష్టంగా ఉంది. ఉప్పునీరే తాగాల్సి వస్తోంది. సరిగ్గా నిలబడలేకపోతున్నాను. ఈ ఒత్తిడి నా కడుపులో పెరుగుతున్న బిడ్డపై పడుతుందని భయంగా ఉంది' అంటోంది. వైద్య సాయం కోసం యుఎన్‌ హెల్త్‌ సెంటర్‌ని సంప్రదించాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలించలేదు. సరైన పోషకాహారం అందక ఆమె చాలా బలహీనంగా ఉంది. ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆ శిబిరంలో కిక్కిరిసిన జనాభా ఉన్నారు. తీవ్ర అలసటతో ఉన్న ఆమె రోజు మొత్తంలో 30 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు. ఈ శిబిరంలోనే అస్రాఫ్‌తో పాటు మరో ముగ్గురు గర్భిణీలు ఆశ్రయం పొందుతున్నారు. రెండు రోజుల క్రితమే వారిలో ఒకరు తీవ్ర ఒత్తిడితో కళ్లు తిరిగిపడిపోయారని అస్రాఫ్‌ గుర్తు చేసుకుంది.

222


          బిడ్డల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసి ఐవిఎఫ్‌ ద్వారా మాతృత్వాన్ని పొందుతున్న మహిళల పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. లైలా బరాకా (30) మూడు నెలల గర్భిణీ. రెండో బిడ్డ కోసం ఎన్నో ప్రయత్నాల తరువాత ఐవిఎఫ్‌ విజయవంతమై ఆమె గర్భం దాల్చింది. 'ప్రతి రోజూ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. రాత్రి పగలు తేడా లేదు. భయాన్ని పోగొట్టుకోవడానికి నా ఐదేళ్ల బిడ్డను గట్టిగా హత్తుకుంటున్నాను. అయినా భయం పోవడం లేదు. ఇక్కడ వినిపిస్తున్న శబ్దాలు మనుషులనే కాదు రాళ్లకు కూడా భయపెడతాయి' అంటోంది ఆమె.
          నెలలు నిండిన బరాకా, సుఖ ప్రసవం కోసం ఖాన్‌ యౌనిస్‌ నుండి సురక్షిత ప్రాంతమైన పెద్ద సిటీకి చేరుకుంది. ఇక్కడికి చేరుకున్నప్పటి నుండి ఆమెకు చికిత్స అందలేదు. సరిహద్దు మార్గాలు మూసివేయబడడం వల్ల అక్కడ ఉన్న ఏకైక వైద్యఆరోగ్య కేంద్ర మూతబడింది. 'నేను వచ్చిన ప్రాంతంలో నా డాక్టరు కూడా ఎక్కడికో వెళ్లిపోయారు. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఇక్కడ వైద్యులు లేరు, వైద్యం అందడం లేదు. ఈ పరిస్థితులు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. కుప్పలుతెప్పలుగా పడిఉన్న పిల్లలు, మహిళల మృతదేహాలు నాకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి' అంటూ వణుకుతున్న స్వరంతో ఆమె చెబుతోంది.
         'యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ (యుఎన్‌పిఎఫ్‌) ప్రకారం గాజాలో 50 వేల మంది గర్భిణీలు ఉన్నారు. వారిప్పుడు వైద్య పరీక్షలకు దూరంగా నెట్టివేయబడ్డారు. ఆస్పత్రులు మూతబడ్డాయి. ఎలాంటి వైద్యమూ అందని పరిస్థితి! రెండు వారాల నుండి గాజా నుంచి లక్షల మంది ప్రజలు తరలి వెళ్లిపోతున్నారు. వారిలో గర్భిణీలు కూడా ఉన్నారు. ఆరోగ్యకేంద్రాలు అందుబాటులో లేక తల్లీబిడ్డ ప్రమాదంలో ఉన్నారు' అని ఖాన్‌ యౌనిస్‌లోని నాసిర్‌ మెడికల్‌ కాంప్లెక్స్‌ ప్రసూతి వైద్యులు వాలిద్‌ అబు హతాబ్‌ ఆవేదన చెందుతున్నారు.
          ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ బాంబుల దాడికి మృతి చెందిన పాలస్తీనీయన్లు 6,500 మంది కాగా, వారిలో 2/3 వంతు మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. 'ఇదేనా మా పిల్లల భవిష్యత్తు. 75 ఏళ్లుగా మేము భీకర వాతావరణంలో జీవిస్తున్నాం. మా సొంత గడ్డపై భద్రత లేని బతుకులు వెల్లదీస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఈ మారణకాండ మమ్మల్ని పూర్తిగా తుదముట్టించేంత వరకు ఆగేలా లేదు. రక్షించేవారు లేక మా ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి' అని అక్కడి తల్లుల రోదిస్తున్నారు. యావత్‌ మానవ సమాజం వారికి సంఘీభావం తెలపాల్సిన, చేయూతనందించాల్సిన సమయం ఇది !