May 14,2023 11:16

అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం, ఓ ధైర్యం, ఓ స్నేహం... ఇలా ఎన్ని చెప్పినా పదాలకు అంతం ఉంటుందేమో కానీ అమ్మ భావనలకు అంతం ఉండదు. దేనితోనూ వెలకట్టలేనిది తల్లి ప్రేమ ఒక్కటే. నిస్వార్థమైన సహకారాన్ని అందించేది ఒక్క అమ్మే. పేదవాడు అంటే ధనం లేని వాడు అనుకుంటాం.. కానీ అమ్మ లేనివాడు, అమ్మ ప్రేమ దక్కనివాడే నిజమైన పేదవాడు. 'ప్రపంచంలోని దేశదేశాల్నీ చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను' అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్‌. సంపాదించిన డబ్బే కాదు.. కీర్తి ప్రతిష్టలు, ప్రేక్షకుల అభిమానం కూడా అమ్మ ప్రేమ తరువాతనే. అలాంటి అమ్మ ప్రేమను చాటుతూ మదర్స్‌ డే జరుపుకోవడానికి ఒక రోజు సరిపోతుందా..! వెలకట్టలేనిదనేటప్పుడు సరిపోవటం అనేది ఎంతవరకు..! అయితే ఆ ఒక్కరోజు ఆమెకు దక్కిన ప్రత్యేకతను మనసారా తీసుకొని సంవత్సరమంతా అనుభూతి పొందుతూనే ఉంటుంది. అదే అమ్మ ప్రేమకున్న ప్రత్యేకత. మరి ఇంతటి ఔన్నత్యాన్ని చాటిచెప్పే అమ్మ ప్రేమ గురించే ఈ ప్రత్యేక కథనం.

111

                                                                            మదర్స్‌ డే అంటే..

తల్లులను గౌరవించాలనే ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఇంగ్లాండ్‌లో 'మదరింగ్‌ సండే' జరిపేవారు. ఇది17వ శతాబ్దంలో ఒక ఉత్సవంలా జరిగేది. ఈ నేపథ్యంలో 'జూలియవర్డ్‌ హోవే' అనే మహిళ ప్రపంచ శాంతి కోసం మదర్స్‌డే నిర్వహించాలని అమెరికాలో 1872లో ప్రతిపాదించింది. ఆ తర్వాత పశ్చిమ వర్జీనియాకు చెందిన అన్నా జార్వీస్‌ అనే మహిళ జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు ఇచ్చే రోజు కావాలని జనంలోకి వచ్చింది. ఇదే స్లోగన్‌తో మదర్స్‌ డే ఏర్పాటుకు, ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని 1890లో విస్తృతంగా ప్రచారం చేసింది ఆమె. తొలిసారి మదర్స్‌ డేను 1910లో పశ్చిమ వర్జీనియాలో ఒక చర్చిలో జరుపుకున్నారు. 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మదర్స్‌డే ఒక సంప్రదాయంగా మారింది. 1914లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ మాతృ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాడు. అన్నా కోరినట్లు జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించడం జరిగింది. కాలక్రమేణా ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారం ప్రపంచ వ్యాపితంగా మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

667

భారతదేశంలో కుటుంబంలోనే కాక సమాజంలోని స్త్రీలను తల్లులుగా గౌరవించాలని చెబుతూ మదర్స్‌ డే జరుపుకోవడం ప్రారంభమైంది. పిల్లలకు మొదటి గురువు తల్లే. నైతిక విలువల దిక్సూచిగా జీవిత ప్రయాణంలో భావి పౌరులను తయారుచేయడంలో ప్రముఖ పాత్ర తల్లిదే.. అలాంటి వీరమాతలకు పుట్టినిల్లు మన దేశం.

                                                                              తొలి గురువు

ప్రతి ప్రాణికీ అమ్మే తొలి గురువు. అమ్మ వెన్నమనసు లోతు ఎవరూ కొలువలేరురా/ అమ్మఒడి తొలి బడి, పలుకులమ్మ గర్భగుడి/ వెలితి లేని ప్రేమ పంచు అమ్మ కెవరు సాటిరా అంటూ మనసు విప్పిన కవి పలుకులు అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి ఒక్కరికీ అనుభవైక అమృతమే. బిడ్డకు పాలిస్తూ అనేక మాటలు, లాలి పాటలు పాడుతుంది. తల్లితో పాటు ఆ..ఆ.. రాగం తీయటం, ఊ..ఊ.. లు పలుకుతూ తల్లిని మురిపిస్తాడు. లాలీ లాలీ.. అంటూ పాడే జోల పాటకు శబ్దం చేస్తూ నిద్రపోతాడు. నిద్రలో నవ్వుతాడు.. ఉలిక్కి పడతాడు. అమ్మ మాటలు, పాటలు, సాన్నిహిత్యం బిడ్డకు సానుకూలంగా ఉన్నాయని తల్లిప్రేమకు అర్థమౌతుంది. నిశిలో మేఘాల పరదాని జరిపి కాంతులొలికించే శశిని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. ఒకటి, రెండు, మూడు అంటూ నక్షత్రాలను చూపించి లెక్కిస్తూ అంకెలను పరిచయం చేస్తుంది. చందమామ రావే/ జాబిల్లి రావే అంటూ మామ కాని మామను చూపించి మురిపిస్తుంది. ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌ అని తళతళ మెరిసే చుక్కల్నీ తన నవ్వులకు ప్రతీకలని చెబుతుంది. అన్ని విషయాల్లోనూ వెన్నంటే ఉండి నడకతో పాటు నడవడిక నేర్పుతుంది.

022


                                                                                స్నేహమయి

బిడ్డ ఆడితే ఆనందిస్తుంది. పాడితే పరవశిస్తుంది. మాట్లాడితే మైమరచిపోతుంది. తప్పు చేస్తే సరిచేస్తుంది. కష్టమొస్తే కాపాడుతుంది. ధైర్యాన్ని రంగరించి పోస్తుంది. జీవిత పాఠాలు చెబుతుంది. సామాజిక చైతన్యం ప్రేరేపిస్తుంది. అన్నీ తానై స్నేహమయిగా చేయూతనిస్తుంది.
'ప్రతి నాయకుని వెనుక ఒక తల్లి ఉంటుంది' అన్నట్లు -
సర్దార్‌ భగత్‌ సింగ్‌ తల్లి విద్యావతి ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక. దేశ స్వాతంత్య్రం కోసం సంతోషంగా ప్రాణ త్యాగం చేసేంత ధీరత్వం ఆమెనుంచే పుణికి పుచ్చుకున్నారు భగత్‌సింగ్‌.
'నన్ను చంపవచ్చు, కానీ నా ఆలోచనలను చంపలేరు' అంటూ వీర మరణం పొందిన ధీరోదాత్తుడు ఆయన.
స్వరాజ్య స్థాపనకు, పరిరక్షణకు శివాజీని ప్రోత్సహించిన వీరమాత జిజియాబాయి. ఉగ్గు పాలతో వీర గాథలు చెప్పి, యుద్ధవిద్యలు నేర్పించి కుమారుని పట్టాభిషిక్తుణ్ని చేసింది ఆమె. రాజ్య పాలనలో స్ఫూర్తిదాయకమైన కర్తవ్యబోధ చేసి చరిత్రలో వీరుడిగా నిలిపింది.
'నా జ్ఞాపకశక్తిపై మా అమ్మ ఉంచిన అత్యద్భుతమైన ముద్ర సాధుత్వం' అంటారు మహాత్మా గాంధీ. తల్లి పుతలీబాయి స్ఫూర్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ పితగా నిలిచారాయన.
 

044

                                                                         అమ్మ అందరికీ అమ్మే

అమ్మ అందరికీ అమ్మే. మనిషే కాదు. మిగిలిన జీవరాశిలోనూ పిల్లల విషయంలో తల్లిప్రేమే కీలక భూమిక. పక్షి రెక్కలొచ్చినప్పటి నుంచి తల్లిపక్షిని అనుసరించి ఆహారాన్ని సేకరించుకుంటుంది. గూడు కట్టుకుంటుంది. ఇతర జీవుల నుంచి తనను తాను కాపాడుకుంటుంది. ఇలా ఎన్నెన్నో నేర్పించే గురువు అమ్మ. మన మనుగడ సాగించే భూమికి, మన ఉనికిని నిలుపుకోడానికి తోడ్పడే భాషకు మాతృత్వాన్ని అన్వయించి మాతృభాష, భూమాత అని వ్యవహరించడంలో మాతృ స్థానం ప్రాధాన్యత అర్థమవుతోంది.

55

                                                                          ముగింపు

ఉరుకులు పరుగుల జీవితాలు. టెక్నాలజీ అభివృద్ధి నీడలు, జాడలు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళటం. పసికందు నుంచే తల్లి ప్రేమకు నోచుకోని పిల్లలు. ఆ ఎడబాటు పిల్లవాడి జీవన విధానం మీద అనేకసార్లు దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. ప్రైవేటీకరణ, నూతనవిద్యావిధానాల మార్పులు ఈ పరిణామాలకు దారితీస్తున్నాయి. పాలకులు మానవతా దృష్టితో ఆలోచించి ఉద్యోగాలు, చదువుల్లో కాలమాన మార్పులు చేస్తే మనిషి ఆలోచన, జీవన విధానాల్లో మార్పు వస్తుంది. ఎప్పటిలా అమ్మ ప్రేమ మాధుర్యాన్ని బిడ్డ పొందే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులు సమాజంపై అన్ని కోణాల్లో ప్రస్ఫుటమౌతున్నాయి.