Aug 07,2023 07:57

          పాటకు మనిషిరూపం గద్దర్‌ అయితే, గద్దర్‌కి అక్షరరూపం పాట. గద్దర్‌ పాటకాలక్షేప సాధనం కాదు, అది శ్రమజీవుల చైతన్య గీతిక. సమాజం మారాలని, సమాజాన్ని మార్చాలని కోరుకునే రచయిత ఆ సమాజాన్ని ఆవరించిన, ఆ సమాజంలో ప్రజల్ని నడిపిస్తున్న తాత్విక భావజాలం నుంచి విముక్తం చెయ్యాలి. భూస్వామ్య వ్యవస్థలోను, పెట్టుబడిదారీ వ్యవస్థలోను, దైవసిద్ధాంతం మనిషిని ఆవరించి ఉంది. మనిషి ఉనికిని తిరస్కరించే ఆ సిద్ధాంతం నుంచి మనిషి విముక్తం కాకుండా సమాజంలో మార్పును తీసుకొని రావడం సాధ్యం కాదు. గద్దర్‌ తన పాటల్లో ఈ కర్తవ్యాన్ని నిర్వహించారు. అజ్ఞానం, భయం, అబద్ధంలోంచి అతి ప్రాచీన మానవుడు సృష్టించుకున్న దేవుణ్ణి స్వార్థ పరశక్తులు వ్యవస్థీరించి విగ్రహలను సష్టించి, దేవుడిని సృష్టించిన మనిషినే ఆ దేవునికి బానిసను చేసి తమ పబ్బం గడుపుకుంటూ ఉండడం నేటికీ చూస్తున్నాం. శ్రమజీవులకు రాజ్యాధికారాన్ని కోరుకునే రచయిత ఈ వైనాన్ని బయట పెట్టాలి. గద్దర్‌ తన పాటతో ఆ పని చేశాడు.
''మతాలల్లో మర్మాన్ని ఇప్పి సెప్పుదాం/ దేవుండ్ల గుట్టంత బయటపెట్టుదాం/ గుణం లేని కులాల గుట్టు చెప్పుదాం/ హిందూమత పిచ్చిగాల్ల మత్తుదించుదాం..'' అని పాడాడు, ఆడాడు.
          ఈ భౌతికవాద తాత్త్విక అవగాహన లేకపోతే మనుషులను భావదాస్యం నుంచి విముక్తం చెయ్యడం వీలు కాదు. ప్రజల్ని భావదాస్యం నుంచి విముక్తం చెయ్యకుండా, జీవిత దాస్యం నుంచి విముక్తం చెయ్యడం సాధ్యం కాదు. గద్దర్‌ రాసిన ఈ పాట మనిషిని శ్రమదాస్యం నుంచే కాక, భావదాస్యం నుంచి కూడా విముక్తం చేస్తుంది. ఒక మతం వదిలి మరో మతంలోకి మారడాన్ని కూడా గద్దర్‌ హర్షించలేదు. ''మతం మార్చకుంటేనేమో/ మనసు చల్లబడ్తదాని/ కష్టాలు బోతయని/ క్రైస్తవ మతములో చేరితే/ కమ్మ క్రైస్తు రెడ్డి క్రైస్తు మాల క్రైస్తు మాదిగ క్రైస్తు / అంటరాని పిశాచము/ ఎంటబడుతున్నది..'' అని పాడాడు. చీలిపోయిన మానవ సమాజాన్ని ఏకం చెయ్యాలంటే చీలికకు మూలాల్ని చీల్చి చెండాడాలని పిలుపునిచ్చాడు.
           మార్పు కోరే కవికి సామాన్యుడే కేంద్రం. సామాన్యుని శ్రమ, దాని ఉత్పత్తి, అది సృష్టింటే అదనపు విలువ, దాని ఫలానుభవం- ఇదే వామపక్షవాద రచయితకు ప్రమాణం. వీటి మధ్య న్యాయం శూన్యమైనప్పుడు రచయిత సామాన్యుని పక్షం వహిస్తాడు. శ్రమదోపిడికి బాసటగా ఉన్న రాజకీయాన్ని ఎండగడుతూ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు స్వాగతం పలుకుతుంది ప్రజాసాహిత్యం. గద్దర్‌ భారతదేశంలోని ప్రకృతి సంపద, సామాన్యులు సృష్టించే సంపద, అది ఎవరికి చెందాలి, దానిమీద అధికారం చెలాయిస్తున్నదెవరు వంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దోపిడి మీద ప్రశ్నలను సంధించారు. గద్దర్‌ పాడిన 'భారతదేశం భాగ్యసీమరా' అనే పాట ఒక్కటి చాలు; భారతదేశ స్థితిగతులను సామాన్యునికి అర్థం చేయించడానికి. అందులో ఒక ప్రశ్న ఉంది. ''సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుండోరో నాయనా'' అన్నది ఆ ప్రశ్న. దానికి జవాబు రాబట్టడమే ప్రజా చైతన్యం.
           'లేదురా యిటువంటి భూదేవి యెందు'' అని స్వాతంత్య్రోద్యమ కాలంలో పాడుకున్నాం. ఇంత గొప్ప దేశంలో - ఇంత ఆధ్యాత్మిక సాంస్క ృతిక సంస్థలో మనుషులందరూ సాంఘిక ఆర్థిక సమానత్వంతో బతకడం లేదు. అవినీతి రాజ్యమేలుతున్నది. గద్దర్‌ దానినే తన పాటలో ప్రశ్నించారు. ''నీతిగల్ల మనదేశంలోనా/ అవినీతెందుకు పెరిగిపోయెరా?'' అన్నది ఆ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు ఏడు దశాబ్దాలకు మించిన చరిత్ర గల స్వతంత్ర భారత పాలకవర్గం సమాధానం చెప్పవలసి ఉంది.
          ఏ పాట తీసుకున్నా అందులో శ్రామిక వర్గానికి చెందిన ఒక కులంవారిదో, కొన్ని కులాల సమూహానిదో, వృత్తులవారిదో జీవితాన్ని చిత్రించి వాళ్ళ శ్రమ దోపిడికి గురికావడాన్ని ఎత్తిచూపి, దానికి పరిష్కారంగా తిరుగుబాటును ప్రతిపాదించడం గద్దర్‌ నిర్మాణ పద్ధతి. ఆయన కవిత్వం నిండా శ్రామికవర్గం పరచుకొని ఉంది. ఆయన కవితలన్నీ శ్రామిక జీవిత చిత్రపటాలు. రైతుకూలీలు, వృత్తికారులు, కార్మికులు, గిరిజనులు, దళితులు, బహుజనులు, స్త్రీలు, కరువు పీడితులు, తుపాను బాధితులు ఆయన కవితల్లో కళారూపం పొందారు. శ్రమజీవుల 'విలాపాగ్నులకు విషాదాశ్రులకు' అక్షర చిత్రాలు గద్దర్‌ పాటలు. శ్రామిక నిర్దిష్టత గద్దర్‌ కవిత్వ లక్షణం. శ్రామిక భారతం ఆయన కవిత్వంలో వీరోచిత పోరాట రూపంలో ప్రతిబింబిస్తుంది. ఆయన రాసిన అనేక పాటల్లో శ్రమ పట్ల గౌరవం, మనిషి పట్ల ప్రేమ, జీవితం పట్ల నమ్మకం కలుగుతాయి. కన్నీళ్ళు లేని ప్రపంచాన్ని కోరుకోవడం కనిపిస్తుంది. ఏయే రంగాల్లో ఎవరెవరు ఎలా శ్రమిస్తూ కన్నీటి బతుకులు గడుపుతున్నారో కవిత్వీకరించి ఆ కన్నీటికి కారణాలను, దానికి విరుగుడును చెప్పారు గద్దర్‌. ప్రజలు పాడుకునే పాటల బాణీలలో ప్రజల జీవన పోరాటాన్ని ఆవిష్కరించిన గద్దర్‌ ప్రజా వాగ్గేయకారుడే!
          మనదేశాన్ని గురించి మన పూర్వికులు ఎన్నో గొప్పలు చెప్పారు. ఇప్పుడు కూడా అవి ఘనంగా వినబడుతూనే ఉన్నాయి. ఆ గొప్ప చెప్పేవాళ్ళు దళితవాడల గురించి నోరు మెదపరు. ఇక్కడ అంటరాని వాళ్ళున్నారు, వాళ్ళు నీచంగా హీనంగా చూడబడుతున్నారు అని అనరు. అందుకే గద్దర్‌ ''బంగారుపంటలిచ్చె భారతగడ్డ మనది/ గంగమ్మ ప్రవహించే - పుణ్యభూమి మనది/ గంగాయమునా బ్రహ్మపుత్ర - కృష్ణా పెన్నా కావేరి ఎన్నెన్నో జీవనదులు - ప్రవహించే జీవగడ్డ/ మాలమాదిగన్నలకే మంచినీళ్ళు కరువాయె'' అని 'పవిత్ర' భారతదేశ వాస్తవికతను ఎత్తిచూపాడు. మనువాద భూమికను ఎత్తిచూపిన గద్దర్‌, దళితుల్లోని అంతర్గత వైరుధ్యాలను కూడా ఎత్తిచూపి, మతమార్పిడి పరిష్కారం కాదని చెప్పి, ''శ్రమ జీవుల విముక్తికై - పిడికిలెత్తి బాస చెరు'' అని విప్లవమార్గంలో ప్రయాణించమని ప్రబోధించాడు. ఆయన చరమాంక దశ మీద అభ్యుదయవాదులకు కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ- కొన్ని దశాబ్దాల పాటు గద్దర్‌ సాగించిన ప్రజాపక్ష పాటల ప్రయాణం చాలా ఉత్తేజకరమైనది, ఉన్నతమైనది. ఆదివారం నాడు (6.8.2023) కన్నుమూసిన ఆ ప్రజా వాగ్గేయకారుడికి జోహార్లు.
 

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి