ప్రజాశక్తి- బుచ్చయ్యపేట (అనకాపల్లి) : వడ్డాదిలో దోమలు ఉదయం, రాత్రి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. వీధివీధిలోనూ దోమలు రయ్.. మంటూ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాగింగ్ కనిపించడం లేదు. పారిశుద్ధ్యం మెరుగు పరచడం లేదు. జనం నానా అవస్థలు పడుతున్నా అటు ప్రజా ప్రతి నిధులు కాని, ఇటు అధికార యంత్రాంగం కాని పట్టించుకోవడం లేదని జనం మండి పడుతున్నారు. జనం ఇప్పటికే ఆస్పత్రుల పాలవుతున్నారు. దోమ కాట్లతో కాళ్లు, చేతులు మండిపోతున్నాయిని గగ్గోలు పెడుతున్నారు. దోమలు భయానికి సాయంత్రం 5 గంటలకే తలుపులు వేసేసుకుంటున్నారు. దోమల నియంత్రణకు మందులు ఎన్ని వాడుతున్నా, ఫలితాలు కనిపించడం లేదని రాత్రి వేళ నిద్ర పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాపించే అవకాశముందని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దోమల నియంత్రణ చర్యల్ని అధికారులు గాలికొదిలేశారు. సకాలంలో పన్నులు కట్టించుకునే అధికారులు ఈ సమస్య పై మాత్రం స్పందించడం లేదని జనం మండిపడుతున్నారు. శీతాకాలం కావడంతో దోమలు మరింతగా వఅద్ధి చెందుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.










