Sep 12,2023 10:55

 2,100కి పెరిగిన మొరాకో భూకంప మృతులు
రబట్‌ : 
 మొరాకో భూకంప బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాగునీరు, ఆహారం, తలదాచుకునే చోటు లేక నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ నెల 8వ తేదీ రాత్రి సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,100 దాటింది. మరో 2,400మందికి పైగా గాయపడ్డారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో మరణించిన వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నుండి బయటపడిన వారు ఆహారం, నీరు, ఆశ్రయం, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది ఇప్పటికీ రాత్రుళ్లు ఆరుబయటనే గడుపుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి శిథిలాల గుట్టగా మారడంతో, భూకంపానికి గురైన మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు సహాయక సిబ్బంది వెళ్లడం సవాళ్లతో కూడినదిగా వుంది. ఇతర దేశాల నుంచి అందే సాయాన్ని స్వీకరిస్తామని, తమకు అవసరమైనట్లుగా వాటిని సమన్వయం చేసుకుంటామని మొరాకో ప్రభుత్వం తెలిపింది.

మొరాకో సాంస్కృతిక వారసత్వానికి కూడా గణనీయంగా నష్టం వాటిల్లింది. 12వ శతాబ్దానికి చెందిన మసీదు కుప్పకూలిందని స్థానిక మీడియా తెలిపింది. యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించిన మరకేష్‌ పాత బస్తీలోని పలు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. 1960ల్లో వచ్చిన తీవ్ర భూకంపంలో దాదాపు 12వేల మంది చనిపోయారు.

ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంత తీవ్రమైన భూకంపం నమోదైంది. స్పెయిన్‌, బ్రిటన్‌, కతార్‌, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే సహాయక బృందాలను పంపించాయి. మూడు లక్షల మంది ఈ ప్రకృతి వైపరీత్యానికి ప్రభావితులయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మూడు రోజుల పాటు మొరాకోలో జాతీయ సంతాప దినాలు పాటిస్తున్నారు.