నాయన ఎప్పుడు లేచిండో
దంతావధానం కానిచ్చాడు
నులక మంచం గుడిసెకు ఆంచాడు.
నాగలి నాయన భుజం మీద ఎక్కి కూర్చింది
తలకి తలపాగా వేకువ పిట్టకు శ్రీరామ రక్ష
రాళ్ళు రప్పలు ముళ్ల కంపలు ఎదురైనా
తొక్కుకు పోతున్నాడు.
గాయాలైన రక్తం కారుతున్నా
బాధ మెలిపెడుతున్నా
అడుగుల సవ్వడి ఆగదు
చేనుగట్టు మీద పాదం మోపేవరకు.
బురద పూల కోసం
చెమట చుక్కల సేద్యం చేస్తాడు
వెన్నెముక అరిగే వరకు
పాటు పడతాడు.
విల్లు విరిచిన బాణం తానౌతాడు
చీడపీడలు అరికడతాడు
పసిడి రాసులు
కళ్ల చూడాలి అనుకుంటాడు.
అతివృష్టి అనావృష్టి రక్కసులు
పిలవని పేరంటాలు
నాయన పాలిట రాక్షస పుండ్లు.
యుద్ధ క్షేత్రంలో గెలిచినా
మద్దతు ధర దొరకదు
అప్పుల ఊబిలో
కూరుకపోక తప్పడంలా
వ్యవసాయం ఎక్కిరించక మానడంలా.
- గాదిరాజు రంగరాజు
సెల్ : 8790122275










