తాడేపల్లి : మన సమాజంలో ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలు, ఆదర్శాలు అన్నీ పెను మార్పులకు లోనయ్యాయి. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, నేతాజీ, సుందరయ్య వంటి ఆదర్శ నాయకుల నుంచి కాక, 'సత్యం' రామలింగరాజు, చందా కొచ్చర్, సుందర పిచారు వంటి వారు యువతరానికి ఆదర్శమూర్తులని ప్రబోధించే మోటివేషనల్ సందేశాలు పెరిగాయని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వసంపాదకులు ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. ప్రజాశక్తి బుకహేౌస్ ప్రచురించిన 'ఉదయ వీచికలు' పుస్తకాన్ని ప్రజాశక్తి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంవిఎస్ శర్మ ఆవిష్కరించారు. ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ... గత నాలుగేళ్లుగా ప్రతి ఆదివారం ప్రజాశక్తిలో వస్తున్న సంపాదకీయాలలో ఎంపిక చేసిన కొన్నింటిని 'ఉదయ వీచికలు' పేరుతో ప్రజాశక్తి బుకహేౌస్ పుస్తకంగా తీసుకొచ్చిందని అన్నారు. ఉదయం లేవగానే ప్రశాంతంగా చదువుకోగలిగేలా, మంచి ఆలోచనలను మనసులోకి ఎక్కించుకోడానికి ఉపయోగపడేలా ఈ సంపాదకీయాలు వుంటాయి. సరైన మానవతా విలువలను తిరిగి సమాజానికి గుర్తుచేసేటటువంటి అనేక అంశాలు ఈ సంపాదకీయాల్లో వుంటాయన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ పుస్తకానికి పెట్టిన 'ఉదయ వీచికలు' అనే పేరు కూడా సముచితంగా వుందన్నారు. ఈ పుస్తకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం వుందని శర్మ అన్నారు. తులసీదాస్ మాట్లాడుతూ... నాన్‌సీరియస్ అంశాలను ఆదివారంనాడు సంపాదకీయాల రూపంలో ఇవ్వడమనేది ఇటీవల అన్ని పత్రికల్లో ఒక ట్రెండ్‌గా వుందని అన్నారు. ప్రజాశక్తిలో ప్రతి ఆదివారం వచ్చే సంపాదకీయాలు సామాజిక అవగాహన కలిగించేవిగా వుంటాయని అన్నారు. ఇంకా ఈ సభలో ప్రజాశక్తి సిజిఎం వై.అచ్యుతరావు, బుకహేౌస్ ఎడిటర్ ఎస్.వెంకట్రావు, జనరల్ మేనేజర్ కె.లక్ష్మయ్య, పుస్తక రచయిత రాజాబాబు కంచర్ల ప్రసంగించారు.










