Aug 02,2023 21:02

'టేకహేోం రేషన్' ప్రారంభం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రక్తహీనత పూర్తిగా తొలగిపోవాలని, పోషకాహారం ప్రతి ఒక్కరికీ అందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మహిళా శిశుసంక్షేమశాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలుకు ఇచ్చే వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ టేక్‌ హోం రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డ్రై రేషన్‌ కింద ఇచ్చే సరుకులు నాణ్యతపై అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని పేర్కొన్నారు. రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలనే లక్ష్యంతో ఈ పనిచేస్తున్నామని వివరించారు. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల కోసం గత ప్రభుత్వం ఏడాదికి రూ.450 కోట్ల నుండి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఏడాదికి రూ.2300 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలని, అక్కడ పిల్లలు, తల్లులు బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలని కోరారు. బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదవుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, ఫౌండేషన్‌ స్కూళ్లలో ఇంగ్లీషు ఉచ్ఛారణపై దృష్టి సారించాలని తెలిపారు. నిర్దేశించిన సిలబస్‌ బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సిఎం సూచించారు. మూడో తరగతి నుండే టోఫెల్‌ శిక్షణ మొదలైందని పేర్కొన్నారు. ఫౌండేషన్‌ స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా మాంటిస్సోరి విద్యావిధానంపై చర్చించిన సిఎం మాంటిస్సోరి విద్యా సంస్థలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.