
న్యూఢిల్లీ : అమెరికా కన్నా.. భారతీయులే కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉత్పత్తుల పట్ల మొగ్గుచూపుతున్నట్టు స్టాన్‌ఫార్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ ఉత్పత్తుల వాడకం పెరిగి, భారతీయుల జీవితాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఇక స్టాన్‌ఫార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన ఎఐ ఇండెక్స్- 2023 సమాచారం ప్రకారం... ఎఐ ఉత్పత్తులపై అత్యంత ఆసక్తి చూపుతున్న దేశాల్లో భారతదేశం మూడవదిగా ఉంది. ముఖ్యంగా భారతీయులు ఎఐ ఉత్పత్తుల సేవల లోపాలకన్నా.. ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని బలంగా నమ్ముతున్నట్లు ఐపిఎస్‌ఓఎస్ (పబ్లిక్ ఓపినియన్ స్పెషలిస్ట్) సర్వే కూడా తేల్చింది. చైనీయులు 78 శాతం, భారతీయులు 71 శాతం, సౌదీ అరేబియన్లు 76 శాతం ఈ ఎఐ ఉత్పత్తులపై నమ్మకముంచినట్లు ఈ అధ్యయనం చెబుతోంది. అయితే అభివృద్ధి చెందిన అమెరికా ప్రజలు 35 శాతం మాత్రమే ఈ ఉత్పత్తులపై నమ్ముకముంచినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం కొరియా 62 శాతం, జపాన్ 42 శాతం, జర్మనీ 37 శాతంతో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి.
కాగా, ఎఐ ఉత్పత్తుల వల్ల తమ పనులు సులభతరం అయ్యాయని 87 శాతం మంది చైనీయులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఉత్పత్తులపై 76 శాతం కంపెనీలు ఎఐ సర్వీసులు వల్ల మేలు జరుగుతుందని అభిప్రాయడగా, 30 శాతం కంపెనీలు మాత్రం ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్ గిటాహెబ్ ఎఐ ప్రాజెక్టులు 2022 నాటికి భారత్‌లో 24.2 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే.. స్టాన్‌ఫార్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం భారతీయులు ఎఐ ఉత్పత్తులకు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతుంది.