
ప్రజాశక్తి - నౌపడ :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేటలోని గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రాళ్లు, గ్రావెల్, సిమెంట్ మెటీరియల్‌ను తరలిస్తున్న వాహనాలను నిర్వాసిత గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. నౌపడ నుంచి మూలపేట వరకు ఉన్న ఇరుకు రోడ్ల మీద భారీ వాహనాలు ప్రయాణిస్తుండడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలపేటకు వెళ్లే దారిలో రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని వాటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సుమారు మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. నౌపడ ఎస్‌ఐ కిషోర్‌వర్మ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిర్వాసితుల గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించి, వాహనాలకు దారి ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.4362 కోట్ల వ్యయంతో 24 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఎపి మారిటైమ్ బోర్డు ఆధ్వర్యాన విశ్వసముద్ర కాంట్రాక్టు సంస్థ పోర్టు పనులను ముమ్మరం చేసింది.