Jul 30,2023 12:17

ప్రజాశక్తి- నౌపడ (శ్రీకాకుళం) : సంతబొమ్మాలి మండలం మూలపేటలో గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి రాళ్లు, గ్రావెల్‌, సిమెంట్‌ మెటీరియల్‌ తరలిస్తున్న వాహనాలను నిర్వాసిత గ్రామస్తులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. భారీ వాహనాల ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నౌపడ నుంచి మూలపేట వరకు ఉన్న ఇరుకు రోడ్ల మీద భారీ వాహనాలు ప్రయాణిస్తుండడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మూలపేటకు వెళ్లే దారిలో రెండు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని దానికి పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. మూలపేట, విష్ణు చక్రం, కొత్త లింగూడు, పాతలింగూడు, ఎం సున్నాపళ్లి, రాజపురం, తదితర గ్రామస్తులు వాహనాల్లో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నారని పోర్టు అధికారులకు విన్నవించారు. ఆటోలో ప్రయాణించాలంటే ఇరుకురోడ్లతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. వాటర్‌ పైప్‌ లైన్‌ దెబ్బతింటున్నాయని తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నౌపడ ఎస్సై కిషోర్‌ వర్మ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మూలపేట వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు వెనక్కి తగ్గి వాహనాలకు దారి ఇచ్చారు.
ఈ ఏడాది ఏప్రిల్‌ 19న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి రూ.4362 కోట్ల వ్యయం తో 24 మిలియన్ టన్నులు సామర్థ్యం కలిగిన మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసారు. ఏపీ మారిటైమ్‌ బోర్డు ఆధ్వర్యంలో విశ్వసముద్ర కాంట్రాక్ట్‌ సంస్థ పోర్టు పనులను ముమ్మరం చేసింది. పనులు చక చకా సాగుతున్నాయి. ఈ నేపద్యంలో వాహనాలను నిర్వాసితులు ఆపి తమ ఇబ్బందులు తెలియజేశారు.