Aug 07,2023 08:59

ఆకుపచ్చ మర్రి మీద
గుబురాకుల కొమ్మలపై
ఎండు పుల్లలన్నీ తెచ్చి
గూడు కట్టే ఆడ కాకి.

పున్నమి రాకుండగనే
అరడజను గుడ్లు పెట్టె
లెక్కించెను మరునాడు
మరో గుడ్డు పెరిగె నచట.

మతిమరపును తిట్టుకుంటు
తనలో తను నవ్వుకుంది
గూడును వెచ్చగ చేసి
గుడ్లనేమో పొదిగింది.

ఎర్రని పిల్లల చూసి
సంతసించె తల్లికాకి
దగ్గరకు చేర్చుకుని
ముద్దు పెట్టి మురిసిపోయే.

ఎచటెచటో తిరిగి కాకి
తెస్తున్నది ఆహారం
ప్రతిపిల్లకు నోటికిచ్చి
చూపుతోంది మమకారం.

ఎదుగుతున్న పిల్లలన్ని
ఎగర నేర్చుకుంటున్నవి
అటూ ఇటూ జారి పడుతు
కాకి గోల చేస్తున్నవి

కావు కావు అనేచోట
కుహుకుహు మని వినిపించెను
ఆ కూతను విన్న కాకి
కోయిల అని గమనించెను.

గుడ్లను తను పొదగలేక
నా గూటిన విడిచింది
పుట్టిన తన పిల్లను కన
కోయిలమ్మ ఎగురుతోంది.

అది చూచిన కాకమ్మ
ఆ తల్లిని పిలిచింది.
కోయిలకు పిల్ల నిచ్చి
జాగ్రత్తలు చెప్పింది.

అమ్మంటే అంతే మరి
అవనిలోన ఎత్తైనది
ఎవరి పిల్లనైనా సరే
ఒకేలాగ సాకుతుంది!
 

- కూచిమంచి నాగేంద్ర
91821 27880