
'చూడండి.. ఆ మైదానంలోకి ఆటగాళ్లు ఆడటానికి వచ్చారు. వారిలో ఒకరు ఓడతారని, మరొకరు గెలుస్తారని అందరికీ తెలుసు. వారు ఏ దేశం వారో.. ఏ రాష్ట్రం వారో అన్న దానిపై గెలుపు, ఓటమి ఆధారపడి ఉండవు. కాబట్టి ఆటను ఆటగా చూడండి. ఈ ఆటలో నా కొడుకు గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రత్యర్థి ఆటగాడు (పాకిస్తాన్) ప్రదర్శించిన ఆటతీరుపై కూడా నేను ఆనందంగా ఉన్నాను' అన్నారు సరోజాదేవీ. ఆమె ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా తల్లి.
ఆమె ఇంతలా ఎందుకు స్పందించారంటే.. నీరజ్ ఇటీవల బోడాపెస్ట్‌లో జరిగిన జావెలిన్ ప్రపంచ అథ్లెటిక్స్‌్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణం సాధించి రికార్డు సృష్టించాడు. 'ఇంతవరకు ఏ భారతీయ ఆటగాడు సాధించని ఘనత ఇద'ని దేశం యావత్తు అతన్ని వేనోళ్ల కీర్తించింది. ఇంతవరకు బానే ఉంది. అయితే ఈ పోటీలో నీరజ్ తలపడింది పాకిస్తానీ ఆటగాడు అర్షద్ నదీమ్‌తో.. అదే పెద్ద సంచలనంగా చూశారు కొంతమంది అతి దేశభక్తులు.. దాయాది దేశ ఆటగాడితో పోరాడి గెలిచిన నీరజ్‌ని ప్రశంసలతో ముంచెత్తుతూ 'ఓ పాకీస్తానీ ఆటగాడిపై మీ కొడుకు విజయం సాధించడాన్ని మీరెలా భావిస్తున్నార'ని ఓ దేశభక్త మీడియా రిపోర్టరు సరోజాదేవిని అడిగాడు. ఆ సందర్భంలోనే ఆమె పైవిధంగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'కొడుకు స్వర్ణం గెలిస్తే.. అమ్మ బంగారం లాంటి మాటలు మాట్లాడార'ని ఎంతోమంది ఆమెని అభినందిస్తున్నారు.
రెండు కులాలు, రెండు మతాలు, రెండు దేశాల మధ్య సఖ్యత సహించలేని ఎంతోమంది ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్ టీమ్‌తో తలపడే సందర్భాన్ని ఓ సంచలనంగా చూస్తారు. ఆటలో పాకిస్తాన్ ఓటమిని, భారత్ గెలుపుని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ అది ఆట.. ఆటని ఆటలా చూడాలి.. పోటీలో పాల్గొనే వరకే ఇరు జట్లు ఒకరిపై ఒకరు పోరాట పటిమ చూపిస్తారు. ఎప్పుడైతే ఆట ముగుస్తుందో.. అప్పుడు ఆటగాళ్లంతా కరచాలనం చేసుకుంటూ, స్నేహపూర్వక ఆలింగం చేసుకుంటూనో కనపడడం మనం చాలాసార్లు చూశాం. నీరజ్ కూడా ఆట ముగిసిన వెంటనే నదీమ్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో కూడా 'మన రెండు దేశాలు ఆటలో పురోగతిని సాధిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎప్పటికీ ఇది ఇలానే కొనసాగాలి' అన్నాడు. కానీ, కొంతమందికి ఈ దృశ్యాలు మింగుడుపడవు. కులం పేరుతో మతం పేరుతో మనుషుల మధ్య.. అవకాశం వస్తే దేశాల నడుమ కూడా విద్వేషం చిమ్మేందుకు సిద్ధంగా ఉండే మనుషులకు ఇప్పుడు సరోజా దేవి వ్యాఖ్యలు చెంపపెట్టులా ఉన్నాయి.