
పిల్లలూ,
ఈ రోజు ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. ఇంజినీర్‌గా ఆయన చేసిన సేవలకు గుర్తుగా నేడు దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే'ను జరుపుకుంటారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబరు 15, 1861న చిక్క బళ్లాపూర్ సమీపంలోని ముద్దెనహళ్ళిలో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందినవారు. విశ్వేశ్వరయ్య బెంగళూరులో హైస్కూలు విద్య, డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు.
ఉపకార వేతనంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య, బొంబాయి రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, తరువాత సుక్నూర్ బ్యారేజ్ నిర్మాణానికి పర్యవేక్షకుడిగా నియమితులయ్యారు. సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
1912 నుంచి 1918 వరకూ విశ్వేశ్వరయ్య మైసూర్ సంస్థానానికి దివాన్‌గా పనిచేశారు. మైసూర్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకం. కృష్ణరాజసాగర్ డ్యామ్, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, మైసూర్ శాండల్ ఆయిల్ అండ్ సోప్ ఫ్యాక్టరీ, యూనివర్శిటీ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్... వంటి ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కృషి దాగి ఉంది.
హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ప్రణాళికను కూడా విశ్వేశ్వరయ్యే రూపొందించారు. మూసీతోపాటు దాని ఉపనదిగా ఉండే ఈసీపై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటు కోసమూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కృషి చేశారు.
ఒకసారి బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓ రైలు వెళ్తోంది. ఉన్నట్లుండి ఓ బక్కపల్చటి వ్యక్తి లేచి నిలబడి రైలు చైన్ లాగాడు. వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది. అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు. అక్కడికొచ్చిన గార్డు, 'చైన్ ఎవరు లాగార'ని ప్రశ్నించాడు. 'నేనే, కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది. రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు, దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది' అని ఆ వ్యక్తి వివరణ ఇచ్చాడు. రైలు గార్డు పట్టాలపై కొద్ది దూరం నడిచి వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పట్టాలు రెండూ దూరం దూరంగా పడి ఉన్నాయి. నట్లు, బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి. ఆ చైన్ లాగింది ఎవరో కాదు; మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఎంతటి గొప్ప ఇంజినీరో చెప్పటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.
1955లో విశ్వేశ్వరయ్యకు భారత ప్రభుత్వం 'భారతరత్న' పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్‌లో చేరిన విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తిని గడించారు. ఆయన పేరు మీద ఎన్నో సంస్థలు ఏర్పాటయ్యాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.