Aug 07,2023 07:53

         అతడు- గుంటూరు జిల్లా కొలకలూరు దళితవాడకు చెందిన గురవయ్య, రత్తమ్మలకు మూడవ సంతానం. చిన్ననాటి నుండి నటనలో ఆసక్తి, సాహిత్యంపై మక్కువ ఉన్న మావూరి మహా రచయిత మోదుకూరి జాన్సన్‌. నటుడుగా పలు నాటకాల్లో నాయకుడు పాత్రలో రాణించినవాడు. దర్శకత్వంలో మెళకువలతో 'మాస్టర్‌', 'దొంగవీరుడు' నాటకాల్లో ప్రతినాయకుడు పాత్ర ఆయనే. జాన్సన్‌ స్వీయ సంగీత దర్శకత్వంలో మధుర కవి నూతక్కి అబ్రహాం రచన 'పాపక్షమ' నాటకంలో క్రీస్తుగా శిలువ మీద కనిపించినవాడు- జాన్సన్‌. క్రైస్తవ సమాజంలో గుర్తింపు పొంది, అనేక ప్రదర్శనలతో ప్రసిద్ధికెక్కిన నాటకం ఇది.
           'నటనాలయం', 'దేవాలయం', 'నీరద', 'శిలువ భారం' నాటకాలు కాకుండా అముద్రిత నాటకాలు, వైద్యసేవలు అంకితభావంతో అందించే 'బాధ్యత' నాటిక, వైద్య విద్యార్థులు ఎదుర్కొనే 'ర్యాగింగ్‌' భూతానికి 'పట్టాభిషేకం' పేరుతో రాసిన నాటికను అప్పటి వైద్య విద్యార్థులు ఇప్పటికీ మరిచిపోలేదు.
        ఇలా కళాకారులకు నిలయమైన కొలకలూరు పల్లెలో జాన్సన్‌ చుట్టూ ఎప్పుడూ పదిమంది సందడి చేస్తూ ఉండేవాళ్ళు. నాటక రచయితలు అప్పుడే సినిమా ఇండిస్టీలోకి ప్రవేశిస్తున్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజులవి. అయితే అందరికీ అక్కడ నేరుగా ప్రవేశానికి అనుమతి ఉండేది కాదు. అక్కడ 'ఎంట్రీ రిస్టిక్టెడ్‌' బోర్డు ఉండేది. అయితే తన ప్రతిభతో, అటువంటి మూసిన తలుపుల్ని తోసుకుని మరీ లోపలి చొచ్చుకుని వెళ్లి, అక్కడ 'సెటిల్‌' అయినవాడు- జాన్సన్‌ !
           లాయరుగా తెనాలిలో ఉన్నప్పుడు, నటీనటుల ఆలయం- 'నటనాలయం' అంటూ కళాకారుల కష్టాల్ని కళ్ళకు కట్టినట్లు చెబుతూ రాసిన నాటకం- 'నటనాలయం'. అందులో ప్రతి నాయకుడి పాత్రలో జాన్సన్‌ కనిపించేవాడు. ఈ 'నటనాలయం' నాటకం ద్వారా అనేకమంది రచయితలకు, నటులకు ఆయన స్ఫూర్తినిచ్చారు. 'నటనాలయానికి' ఉత్తమ నాటక రచనకు ఆంధ్ర కళాపరిషత్తు గుర్తింపు రావడంతో, జాన్సన్‌కు మెడ్రాస్‌ దారి సులభతరం అయింది. అలాగే అది స్వస్థలం తెనాలిలో ఆయనకొక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ నాటకం చూసి గుమ్మడి తన స్నేహహస్తం అందించడం, ఆదుర్తి, అక్కినేని ఆశీస్సులతో- 'మరో ప్రపంచం' చిత్ర రచనతో జాన్సన్‌ సినీ ప్రస్థానం మొదలయింది.
రచయితగా జాన్సన్‌ ఉద్దండులైన రచయితలు గొల్లపూడి మారుతీరావు, కొలకకూరి ఇనాక్‌ సమకాలీకులు. జాన్సన్‌ బి.ఎల్‌. చదువుతున్న రోజులవి. ఓ సభకు దాశరధి, 'సినారె' అతిథులుగా వచ్చిన సందర్భం- 'మాట్లాడే మల్లె మొగ్గ' అనే పాటకు కేవలం కొన్ని నిమిషాల్లోనే స్వరపరచి వేదికపై పాడి అలరించి ఆనాటి హీరోగా మారినవాడు- జాన్సన్‌. అప్పటికే జాన్సన్‌తో స్నేహంగా ఉన్న మారుతీరావు ఓ సభలో ఆ విషయం ప్రస్తావించడం, ఆ సభకు నేనే కన్వీనరుగా వ్యవహరించడం ఇప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం.
        నాటక రంగం నుంచి వచ్చి సినీ రచయితలుగా మారి నిలదొక్కుకున్నవాళ్లలో- నరసరాజు, ఆత్రేయలకు ధీటుగా నిలబడగలిగాడు మోదుకూరి జాన్సన్‌. 'మరో ప్రపంచం' తర్వాత తన కథ, సంభాషణలతో- 'మానవుడు దానవుడు' (1972) విజయంతో జాన్సన్‌ చిత్ర పరిశ్రమలో 'సెటిల్‌' అయిపోయాడు. అప్పట్లోనే, శోభన్‌ బాబుకు 'స్పిట్‌ పర్సనాలిటీ' హీరో కథ రాసి సౌమ్యుడైన డాక్టర్‌ వేణు - 'రెబల్‌' జగన్‌ ఇలా ఒక్కరినే ఇద్దరుగా 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' తెరమీద చూపించి, జాన్సన్‌ రచయితగా తన విశ్వరూపం చూపించారు. జాన్సన్‌ వన్లైన్‌ డైలాగులు- ''నీవు భుజంగం- అంటే పామని తెలుసు, కాని... నేను పాములను ఆడించేవాడినని నీకు తెలియదు.'' ''చిల్లర పనులు చేయడం ఈ జగన్‌ చేతకాదు. చిల్లర దేవుళ్ళకు ఈ జగన్‌ మొక్కడు'' వంటి డైలాగులతో ఆ చిత్రంతో 'దటీజ్‌ జాన్సన్‌..' అనిపించుకొన్నాడు మోదుకూరి.
           'డబ్బుకు లోకం దాసోహం' చిత్రంలో ఎలక్షన్లో నిలబడే సందర్భాల్లో ఎన్టీఆర్‌ బాబాయిగా మిక్కిలినేని అంటాడు : ''చూడు బొగ్గుగా ఉన్నప్పుడు మాత్రమే చేత పట్టుకోవచ్చు. అది నిప్పుల్లో పడి నిప్పుకణికగా మారాక మాత్రం దాన్ని పట్టుకోలేం'. అప్పటి వరకు హీరోకి ఉండే పెద్ద డైలాగుల ధోరణికి భిన్నంగా క్లుప్త పదాలతో 'పంచ్‌ డైలాగ్‌' వేసే కొత్త ధోరణిని మొదటిసారి వెండితెరకు పరిచయం చేసినవాడు మోదుకూరి. టి.కృష్ణ దర్శకత్వంలో (1985) తయారైన సంచలనాత్మక చిత్రం- 'దేవాలయం'లో శంకరం (శోభన్‌ బాబు) పూజారిగా మారిన నాస్తికుడు. అతడు శ్మశానం కల్యాణవేదికగా గౌరి (విజయశాంతి) అనే దళిత యువతిని మంత్రోచ్ఛ రణల మధ్య వివాహం చేసుకుంటాడు. మూడున్నర దశాబ్దాలు క్రితం అటువంటి సన్నివేశాన్ని తెరపై సృష్టించడం అనేది ఇప్పటికీ ఊహించడం కష్టమే !
            'దేశోద్ధారకులు' స్వాగతం దొరా! స్వాగతం తేనె లొలుకు తెలుగు నేలకు అంటూ సాగే పాట కృష్ణా గోదావరి అమరమ్య ప్రస్తావనలతో తనదైన బాణిలో దేశభక్తిని ప్రదర్శించిన పాట, 'పాడిపంటలు' మన జన్మ భూమి-బంగారు భూమి పాడిపంటలతో పసిడి రాశులతో కళకళలాడే జనని మన జన్మభూమి రైతు లేనిదే రాజ్యము లేదంటా' పాడిన పాట. 'కరుణామయుడు'లో- 'కదిలింది కరుణరధం' ఇవన్నీ గీత రచయితగా ఆత్రేయ వంటివారి సరసన ఆయన్ని నిలుపుతాయి.
          ఎవరీ జాన్సన్‌ అనే ప్రశ్నకు ఆయన ఓ నట వైతాళికుడు, గాయకుడు, రచయిత, కవి ఓ దళిత క్రైస్తవుడు- మా గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకొన్న మహామనిషి, మా పూరి తేజోమూర్తి, వాచస్పతి కొంగర జగ్గయ్యచే 'అగ్నికవి' అనిపించు కొన్న వాడు మా మోదుకూరి.

(ఆగస్టు 8 : మోదుకూరి జయంతి)
- డాక్టర్‌ వల్లూరి రామారావు
94908 77471