- 36 విదేశీ పర్యటనల్లో ఏడింటి ఖర్చుల వివరాలు ఇవ్వలేదు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదేళ్లలో విదేశీ పర్యటనలకు రూ.225 కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో సిపిఎం ఎంపి ఎలమరం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని మోడీ 36 విదేశీ పర్యటనలు చేశారని, అందులో 29 విదేశీ పర్యటనలకు రూ.225,00,23,925 ఖర్చు జరిగినట్లు తెలిపారు. 36 పర్యటనల్లో 11 పర్యటనల్లోనే ప్రధానితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రులు ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దావలే అన్ని పర్యటనల్లో ప్రధాని మోడీతో ఉన్నారు.
మూడేళ్లలో దళితులపై 1,89,945 దాడులు
2018-2021 మధ్య మూడేళ్లలో దళితులపై 1,89,945 అఘాయిత్యాలు జరిగాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 2021లో 50,900 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నమోదైన 1,89,945 కేసుల్లో 42,292 కేసుల్లో విచారణ పూర్తయిందని, 14,321 మందికి శిక్షలు పడ్డాయని వెల్లడించారు.
మూడేళ్లలో మహిళలపై 35,220 సైబర్ నేరాలు
మహిళలపై సైబర్ నేరాలకు సంబంధించి 2018-2021 మధ్య 35,220 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 5,587 నేరాలు సైబర్ అశ్లీలత, అశ్లీల లైంగిక అంశాలను హౌస్ట్ చేయడం, ప్రచురించడం వల్ల కేసులు నమోదయ్యాయి.
ఏపికి 5,11,579 ఎల్‌పిజి కనెక్షన్లు
ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన (పిఎంయువై) కింద 2022 నవంబర్ 30 వరకు ఏపిలో 5,11,579 ఎల్‌పిజి కనెక్షన్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. దేశం మొత్తం మీద 9,56,97,699 కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.










