ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ఒక ప్రాంతానికి లేదంటే, ఒక రాష్ట్రానికి సాక్షాత్తూ దేశ ప్రధాని వచ్చి సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారంటే ప్రధానమైన సమస్యలపై స్పందించి పరిష్కారం చూపుతారని ఆ ప్రాంత ప్రజానీకం ఆశించడం సహజం. విశాఖలోని ఎయు ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభ దీనికి భిన్నంగా సాగింది. ప్రధాని రాష్ట్రానికి సంబంధించిన కీలకసమస్యలను పూర్తిగా విస్మరించారు. ఈ సభ విజయవంతం కోసం రూ.19 కోట్లును గడిచిన 15 రోజులుగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కానీ పట్టుమని మొత్తం సభ కనీసం గంట కూడా సాగలేదు. ఈ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే ప్రకటన చేయడం కానీ, హామీ ఇవ్వడం గానీ ప్రధాని చేయలేదు. దీంతో, ఈ సభకు హాజరైన ప్రజానీకంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది.
ప్రధాన అంశాలపై మౌనం
ఎయు మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సభ శనివారం ఉదయం 10.15 గంటలకు ప్రారంభమై 11.15 గంటలలోపే ముగిసింది. సిఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సమస్యలను గుర్తు చేశారు. జగన్ తర్వాత ప్రసంగించిన ప్రధాన మంత్రి మోడీ వీటిని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఎపి విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో జరగాల్సిన ప్రధాన పనులైన పోలవరం, ఎపికి ప్రత్యేక హోదా, జాతీయ విద్యాసంస్థలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి కీలకమైన ప్రాజెక్టుల ప్రస్తావనా చేయలేదు. ఏడాదిన్నర కాలంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు కార్మికవర్గం, విశాఖ ప్రజానీకం పోరాడుతున్నా ఇక్కడే సమస్యా లేదన్న రీతిలో వ్యవహరించారు. తొలుత వైఎస్ జగన్ ఏడు నిమిషాలపాటు సభలో మాట్లాడారు. తర్వాత ప్రధాని మోడీ ప్రసంగం దాదాపు 26 నిమిషాలు సాగింది. సిఎం తెలుగులోనూ, ప్రధాని హిందీలోనూ మాట్లాడారు. విశాఖకు స్వయంగా మోడీ ప్రకటించిన రైల్వే జోన్ అంశం జోలికి సైతం ఆయన వెళ్లలేదు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మబోం అనే ప్రకటనను విశాఖ వేదికగా 12న మోడీ చేయాలంటూ ఈ ప్రాంత ప్రజానీకం, ప్రజాసంఘాలు, కార్మికులు, మేధావులు కోరారు. కానీ, మోడీ మాత్రం తనకేమీ పట్టనట్టే వ్యవహరించారు. కేవలం రూ.10 వేల కోట్ల ప్రాజెక్టులకే పరిమితం అయ్యారు.










